హైదరబాద్, వెలుగు : ఓటు హక్కు పదిలంగా ఉండేందుకు ‘సర్’ ప్రక్రియలో అందిస్తున్న ‘ఎన్యుమరేషన్ ఫారం’ అత్యంత కీలకంగా మారింది. ఈ ఫారంలో ఏయే భాగంలో ఏ వివరాలు నమోదు చేయాలి? ఒకవేళ జాబితాలో పేరు ఉంటే ఏం చేయాలి? లేకపోతే ఏం చేయాలి? అనే వివరాలు పరిశీలిద్దాం.
పై భాగంలోనే పూర్తి సమాచారం..
ఎన్యుమరేషన్ ఫారంలోని పై భాగంలో ఓటరుకు సంబంధించిన ప్రాథమిక సమాచారమంతా ముందే ముద్రించి ఉంటుంది. ప్రస్తుత ఎలక్టోరల్ రోల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. ఓటరు పేరు, నియోజకవర్గం, సంబంధిత పోలింగ్ కేంద్రం వివరాలు ఫొటోతో సహా స్పష్టంగా ఉంటాయి. వీటితో పాటు ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే సంప్రదించడానికి వీలుగా సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్వో) పేరు, వారి ఫోన్ నంబరును కూడా అందులోనే ముద్రించారు.
2002 నాటికే ఓటరుగా నమోదైన వారు..
2002లో పేరు ఉన్న ఓటర్లు ఫారంలోని తదుపరి భాగంలో ఎడమ చేతివైపు ఉన్న కాలమ్స్‌ను భర్తీ చేయాల్సి ఉంటుంది. అక్కడ తమ పేరు, ఓటరు కార్డు వివరాలు, తల్లి లేదా తండ్రి పేరు వారి వివరాలు రాయాలి.
2002 తర్వాత నమోదైన వారు, కొత్తవారు..
ఒకవేళ 2002 నాటి జాబితాలో పేరు లేని వారైతే.. వారు ఫారానికి కుడిచేతివైపు ఉన్న భాగంలో వివరాలు నింపాలి. ఇక్కడ తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుని పేరుతో పాటు వారి ఓటర్ కార్డు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
అందరికీ సమానమైన మూడో భాగం..
ఫారంలోని చివరి భాగం ఓటర్లందరికీ కామన్ గా ఉంటుంది. ఈ విభాగంలో ఎన్యుమరేషన్ ఫారం ఎవరి పేరుతో జారీ అయిందో.. ఆ సంబంధిత ఓటరుకు సంబంధించిన ప్రస్తుత పూర్తి వివరాలను రాయాలి.
బీఎల్వోలదే పూర్తి బాధ్యత..
వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఓటరు సదరు ఫారంపై సంతకం చేసి స్థానిక బీఎల్వోకు అందజేయాలి. ఓటరు సంతకం తీసుకున్న అనంతరం బీఎల్వో కూడా దానిపై సంతకం చేసి రసీదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇలా సేకరించిన, పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలన్నింటినీ భద్రపరిచి, గడువులోగా నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి (ఈఆర్వో) కార్యాలయాలకు అందజేయాల్సిన పూర్తి బాధ్యత బీఎల్వోలదేనని అధికారులు
స్పష్టం చేస్తున్నారు.
ఫారం అందకపోతే ‘1950’కి కాల్ చేయండి
మీ పరిధిలో ఎన్యుమరేషన్ ప్రక్రియ జరుగుతున్నా.. మీకు ఇంకా ఎన్యుమరేషన్ ఫామ్ అందకపోతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే ఓటర్ల సహాయక అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ 1950కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు లేదా సమాచారాన్ని అందించవచ్చు.
