- ఉషా వాన్స్ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ సమాధానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ఖాళీ సమయాల్లో న్యూస్ పేపర్లు చదవడమంటే ఇష్టమని, అందులో తనపై వచ్చిన వార్తలనే ఎక్కువగా చదువుతానని పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా వాన్స్ ‘స్టోరీ టైమ్ విత్ సెకండ్ లేడీ’ పేరిట హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ పాల్గొన్నారు. ‘‘అధ్యక్షుడిగా ఉన్న మీకు సరదా కోసం పుస్తకాలు చదివే సమయం దొరుకుతుందా?’’ అని ఉషా వాన్స్ అడగ్గా, ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘నాకు అంత సమయం ఉండదు.. ఎక్కువగా వార్తాపత్రికలే చదువుతుంటాను. అందులోనూ ముఖ్యంగా నా గురించి వచ్చే కథనాలనే నేను ఎక్కువగా చదువుకుంటాను” అని సమాధానమిచ్చారు.
మాజీలపై ట్రంప్ మార్క్ సెటైర్లు
వైట్‌హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రచురించిన ‘ప్రెసిడెంట్స్ ప్లే!’ పుస్తకాన్ని పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ చదివి వినిపించారు. అందులోని మాజీ అధ్యక్షుల క్రీడా విన్యాసాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు: అమెరికా చరిత్రలోనే కెన్నెడీ ‘రెండో అత్యంత అందమైన అధ్యక్షుడు’ అని పేర్కొన్నారు. అయితే మొదటి స్థానం ఎవరిదనేది మాత్రం ఆయన దాటవేశారు. ఒబామా బాస్కెట్‌బాల్ ఆడుతున్న చిత్రాన్ని చూసి, ఆయనను ‘బరాక్ హుస్సేన్ ఒబామా’ అని పిలుస్తూ.. ఒబామాకు పెద్దగా బాస్కెట్‌బాల్ ఆడటం రాదని ఎద్దేవా చేశారు. క్లింటన్ జాగింగ్ ట్రాక్‌పై పరిగెడుతున్న బొమ్మను చూసి.. ‘నేనెప్పుడూ అలా పరిగెత్తను’ అని చెప్తూనే.. క్లింటన్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు.
నా రూపంపై నాకే డౌట్
మాజీ అధ్యక్షుల శరీర ఆకృతులపై కూడా ట్రంప్ జోకులు పేల్చారు. గెరాల్డ్ ఫోర్డ్ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న చిత్రాన్ని చూసి, ‘‘నేను బాథింగ్ సూట్‌లో ఎలా ఉంటానో నాకే తెలియదు, చాలా కాలంగా నేను దానిని వేసుకోలేదు” అని అన్నారు. అబ్రహం లింకన్ గుర్రపు స్వారీ చేస్తున్న బొమ్మను చూసి.. తనకు కూడా గుర్రం ఎక్కాలని ఉందని, కానీ గుర్రం పైనుంచి పడిపోతే జరిగే ప్రమాదాలు చూసి భయమేస్తోందన్నారు.
