- రికార్డుల ట్యాంపరింగ్.. ప్రభుత్వ, అసైన్డ్ భూములు ప్రైవేట్ వ్యక్తులకు పట్టా
- ఎమ్మార్వో, ఆర్డీవోలకు సంబంధం లేకుండానే
- అక్రమ మ్యుటేషన్లు
- కోర్టు కేసులు ఉన్న భూములు సైతం డిజిటల్ సైన్ చేయకుండానే మార్పు
- వేల ఎకరాలు తారుమారు చేసినట్టు అనుమానాలు
- ఫోరెన్సిక్ ఆడిట్‌లో గుర్తింపు.. క్షేత్రస్థాయి ఎంక్వైరీతో అసలు విషయాలు బయటకు
హైదరాబాద్, వెలుగు: గతంలో భూముల డేటా నిర్వహణ చూసిన ధరణి పోర్టల్‌లో 304 అక్రమ ఎంట్రీలు ఉన్నట్టు తేలింది. ఎలాంటి క్షేత్రస్థాయి రిపోర్ట్‌లు, అధికారుల లాగిన్‌లు అప్రూవ్చేయకుండా డిజిటల్‌గా ఉన్న భూముల రికార్డులను నిబంధనలకు విరుద్ధంగా ట్యాంపర్చేసినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో గుర్తించారు. ఒక్కో అక్రమ ఎంట్రీలో డబుల్ డిజిట్ ఎకరాలను మార్చేసినట్టు కనుగొన్నారు. ఇలా వేల ఎకరాలు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వీటి విలువ మొత్తం కూడా వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అంచనా.
ఈ ట్యాంపరింగ్‌లో అర్హత లేని వ్యక్తుల పేర్లపైకి యాజమాన్య హక్కులను మార్చేశారు. ముఖ్యంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములు, అసైన్డ్, పోడు భూములకు సంబంధించిన రికార్డులను సిస్టమ్‌లో మార్చేసి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చారు. నాలా కన్వర్షన్, భూముల మ్యుటేషన్ ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు.
నిబంధనల ప్రకారం ఏదైనా ఫైల్‌ను మొదట ఎమ్మార్వో స్థాయిలో క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే, ఆర్డీవో, ఆ తర్వాత కలెక్టర్ తన లాగిన్ ద్వారా ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, వివాదాస్పద ప్రభుత్వ అసైన్డ్ భూముల విషయంలో ఈ పరిశీలన ఏదీ లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా నేరుగా లాగిన్లను దుర్వినియోగం చేస్తూ ఫైనల్ అప్రూవల్స్ ఇచ్చేసినట్టు విచారణలో తేలింది.
కోర్టు కేసుల భూములు డిజిటల్ సైన్ లేకుండానే
భూ వివాదాలకు సంబంధించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 54 కీలక కేసుల ఫైళ్లకు సంబంధించి తీవ్రమైన లొసుగులు బయటపడ్డాయి. ఈ 54 కోర్టు కేసుల రికార్డులకు అధికారుల నుంచి ఎలాంటి ‘డిజిటల్ సైన్’ చేయలేదు. ఆ సంతకాలు లేకుండానే ఈ ఫైళ్లు సిస్టమ్‌లో చలామణి కావడం వెనుక పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం లేదా రికార్డుల మార్పిడి జరిగి ఉండవచ్చని ఆడిట్ బృందం అనుమానం వ్యక్తం చేసింది. ఇవన్నీ కూడా మేడ్చల్మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధికి సంబంధించినవిగా నిర్ధారించారు. వీటిల్లో వందల ఎకరాలు మారినట్టు తేల్చారు. వాటి విలువ మొత్తం వేల కోట్ల రూపాయలు ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫీజుల చెల్లింపుల్లో లొసుగులు..
ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిధ రకాల ఫీజుల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. రిజిస్ట్రేషన్ల కోసం కేటాయించిన స్లాట్ బుకింగ్ సిస్టమ్‌లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది అక్రమాలకు తెగబడ్డారు. ప్రభుత్వానికి అసలైన ఫీజులు చెల్లించకుండానే లేదా తక్కువ మొత్తంలో ఫీజులు చూపించి నిబంధనలకు విరుద్ధంగా స్లాట్లు బుక్ చేసుకున్నట్టు, దానికి సంబంధించిన ల్యాండ్ అప్లికేషన్లను ఆమోదించినట్టు ఆడిట్‌లో స్పష్టమైంది.
టెర్రాసిస్ పాత్ర.. బ్యాక్ ఎండ్ బాధ్యులపై ఎంక్వైరీ
ధరణి కంటే ముందు 2017లో అప్పటి భూ రికార్డుల ప్రక్షాళన చేసి.. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్)ను అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. అప్పుడు రికార్డుల నిర్వహణ అంతా ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే ఉంది. ఆ తర్వాత ఇందులోని వివరాలను 2020లో ధరణి లోకి ప్రభుత్వం మార్చింది. కానీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఉండే టీజీటీఎస్ ( తెలంగాణ టెక్నాలజికల్ సర్వీసెస్) నామినేషన్ పద్ధతిలో ఐఎల్ఎఫ్ఎస్‌కు ధరణి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఈ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను టెర్రాసిస్ అనే సంస్థ కొనుగోలు చేసింది.
ఇదంతా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో, విదేశాల్లో సర్వర్లను నిక్షిప్తం చేసి నడిపించారు. ఇక 2024 డిసెంబర్‌లో టెర్రాసిస్ నుంచి పూర్తిగా ధరణిని ఎన్‌ఐసీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత భూ భారతి పోర్టల్‌ను నిరుడు అందుబాటులోకి తెచ్చింది. అయితే ధరణి డేటా, కోడింగ్ పూర్తిగా ధరణిదే వినియోగిస్తుండటంతో భూ భారతిలోనూ కొన్ని అక్రమాలు జరిగినట్టు భావిస్తున్నారు. దీంతో భూ భారతిని కూడా మార్చాలని భావిస్తున్నారు. ఇప్పుడు టెర్రాసిస్ ఎక్కడ అక్రమాలు చేసిందనే దానిపై సైబర్ సెక్యూరిటీ టీంతో కలిసి లోతుగా ఉన్నతాధికారుల కమిటీ స్టడీ చేస్తున్నది.
భూ విస్తీర్ణంలో భారీగా తేడాలు
రాష్ట్రంలో 2017లో జరిగిన ల్యాండ్ రికార్డుల అప్‌డేషన్‌లో ఐఎల్‌ఆర్‌ఎంఎస్ వెబ్ ల్యాండ్‌లోకి 60.24 లక్షల ఖాతాలకు సంబంధించి 1.48 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా అన్ని రకాల ప్రభుత్వ భూములు (ఫారెస్ట్‌తో కలిపి) 77.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. ధరణి పోర్టల్ప్రకారం అగ్రికల్చర్ సైన్డ్ ల్యాండ్ కోటి 53 లక్షల ఎకరాలు ఉన్నది. నోషనల్ ఖాతాలో అంటే ఇరిగేషన్, ఫారెస్ట్, శిఖం, ఇతరత్రా ప్రభుత్వ భూములు కలిపి 75.96 లక్షల ఎకరాలు ఉన్నది. లక్షల ఎకరాలు తారుమారు అయ్యాయి.
పట్టా భూములు నిషేధిత జాబితాలోకి, ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారాయి. అదే సమయంలో విస్తీర్ణంలోనూ భారీగా తేడాలు వచ్చాయి. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు బాధ్యతలన్నింటినీ ఐటీ డిపార్ట్‌మెంట్ పరిధిలోని ఈ– గవర్నెన్స్, టీజీటీఎస్ స్పెషల్ కమిషనర్ జీటీ వెంకటేశ్వర్‌రావుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. ఎలాంటి సంబంధం లేకపోయినా ధరణి ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆయనకు బాధ్యతలు ఇచ్చింది. దీంతో ఆయన పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
