మహాశివరాత్రి:  శివ స్వాముల శ్రీశైలం పాదయాత్ర.. శివనామ స్మరణతో మారు మోగుతున్న నల్లమల  అటవీప్రాంతం..!

మహాశివరాత్రి:  శివ స్వాముల శ్రీశైలం పాదయాత్ర.. శివనామ స్మరణతో మారు మోగుతున్న నల్లమల  అటవీప్రాంతం..!

నంద్యాల జిల్లా  నల్లమల అటవీ ప్రాంతం ఓంకార నాదాలతో మారుమోగుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వైపు భక్తుల పాదయాత్రలు భక్తి భావంతో కొనసాగుతున్నాయి.

వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు సాగే ఈ పాదయాత్రకు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అటవీ శాఖ అధికారులు అనుమతి ఇవ్వడంతో భక్తులు భారీ సంఖ్యలో వెంకటాపురం చేరుకుంటున్నారు. "ఓం నమశ్శివాయ"... , "హర హర మహాదేవ" అంటూ భక్తి పారవశ్యంలో అడుగులు వేస్తూ శ్రీశైలం వైపు పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

శ్రీశైలం పాదయాత్ర @ 40కిలోమీటర్లు

మల్లన్న భక్తులు పాదయాత్ర ద్వారా శ్రీశైలం చేరుకొనేవారు  వెంకటాపురం నుంచి ప్రారంభిస్తారు. 
కాసాయగట్టు ఆంజనేయస్వామి, నాగులుటి, పెచ్చెరువు, దామర్లకుంట, భీమునకొలను, కైలాస ద్వారం, అటకేశ్వరం మీదుగా భక్తులు అడవి మార్గంలో నడుస్తూ శ్రీశైలం చేరుకుంటారు.

చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం శివనామ స్మరణలో అలసటను లెక్కచేయకుండా సగటున రెండు రోజుల పాటు పాదయాత్ర చేసి శ్రీశైలం చేరుకుని మల్లన్న స్వామిని దర్శించుకుంటున్నారు.

41 రోజులపాటు శివదీక్ష మాలను ధరించి నియమ నిష్ఠలతో ఉన్న స్వాములు ఈ అడవి మార్గంలో కఠినమైన ప్రయాణాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తున్నారు. అడవిలో మారుమోగుతున్న "ఓం నమశ్శివాయ", "శంభో శంకర", "చేదుకో మల్లయ్యా ఆదుకోవయ్యా" నినాదాలు నల్లమల అరణ్యానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొస్తున్నాయి.

పాదయాత్ర భక్తుల కోసం దాతలు అన్నదానం, మజ్జిగ, మంచినీరు, అల్పాహార ఏర్పాట్లు చేస్తున్నారు. మార్గమధ్యంలో విశ్రాంతి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతం కావడంతో అడవి శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

ప్లాస్టిక్ వస్తువులు, బాటిళ్లు అడవిలోకి తీసుకెళ్లకుండాచర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేశారు.

భక్తి, ప్రకృతి మధ్య ఆధ్యాత్మిక అనుభూతి .

శ్రీశైల మల్లన్న దర్శనమే లక్ష్యంగా భక్తుల పాదయాత్ర సాగుతుంది.  శివ స్వాములపాదయాత్ర  నల్లమల అడవిని ఓ పవిత్ర క్షేత్రంగా మార్చేస్తోంది.ఓంకార నాదాలతో ప్రతిధ్వనిస్తున్న నల్లమల అరణ్యంలో  శివనామ స్మరణతో భక్తజనం ముందుకు సాగుతున్నారు. 

వెంకటాపురం దాటిన తర్వాత నల్లమల ఫారెస్ట్ ఎంట్రెన్స్ లో అడవిశాఖ అధికారులు ప్రతి భక్తుని లగేజీని  క్షుణ్ణంగా పరిశీలించి, బిస్కెట్లు, చాక్లెట్లు ప్యాకెట్లు తీసుకొని వాటి కవర్లు చించి కేవలం బిస్కెట్లను పేపర్లో చుట్టి భక్తులకు ఇస్తున్నారు. అడవిలోకి ప్లాస్టిక్ కవర్లు తీసుకు వెళ్లకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు. అలాగే అడవిలోకి ఒక లీటర్ వాటర్ బాటిల్ తీసుకువెళ్లకుండా నియంత్రిస్తున్నారు . కేవలం రెండు లీటర్ల వాటర్ బాటిల్ మాత్రమే అడవిలోకి అటవీ శాఖ అధికారులు అనుమతిస్తున్నారు.