భారత మహిళల జట్టు వరల్డ్ కప్ టైటిల్ కరువును తీర్చుకుంది. ఐదు దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫిని సొంతం చేసుకుంది. సొంతగడ్డపై తిరుగులేని ఆట ఆడుతూ విశ్వ విజేతగా అవతరించింది. ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది. వరల్డ్ కప్ విజయం తర్వాత స్వదేశం చేరుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వరల్డ్ కప్ విజయం గురించి తన అనుభవాలను షేర్ చేసుకుంది.
"మ్యాచ్ కి ముందు రోజు రాత్రి, సచిన్ (టెండూల్కర్) సర్ ఫోన్ చేసాడు. తన అనుభవాలను పెంచుకుంటూ సలహా ఇచ్చాడు. జట్టు సమతుల్యతను కాపాడుకోమని సూచించారు. ఆట వేగంగా జరుగుతున్నప్పుడు మ్యాచ్ ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు చాలా వేగంగా ఆడినప్పుడు పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి. మనం దానిని నివారించాలి". అని సచిన్ చెప్పినట్టు హర్మన్‌ప్రీత్ ది ఐసీసీ రివ్యూలో అన్నారు.
"మేము ఒకరినొకరు చూసినప్పుడల్లా, 'ప్రపంచ ఛాంపియన్' అని మాత్రమే చెబుతాము. ఇది చాలా ప్రత్యేక అనుభూతి. నా తల్లి, తండ్రి అక్కడ ఉన్నారు. నాకు, వారితో కలిసి ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తడం చాలా ప్రత్యేకమైన క్షణం. నా చిన్నప్పటి నుండి నేను భారత జెర్సీని ధరించాలని.. దేశం కోసం ఆడాలని.. జట్టును నడిపించాలని.. ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నానని వారికి నేను చెప్పాను.
"షఫాలీ జట్టులోకి వచ్చిన వెంటనే అందరూ ఆడించాలా వద్దా అని మాట్లాడుకుంటున్నారు. షెఫాలీ ఇంతకు ముందు టీ20 వరల్డ్ కప్ లో ఆడిన అనుభవం ఉందని మాకు తెలుసు. అండర్-19 ప్రపంచ కప్‌ను కూడా గెలిచింది. ఒత్తిడిలో ఎంత బాగా ఆడగలదో ఆమె జట్టుకు ఎంత ముఖ్యమో మాకు తెలుసు. షెఫాలీని ఫైనల్‌లో ఆడించాలనుకున్నాం. అవసరమైతే కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలదు. షెఫాలీ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది". అని కౌర్ చెప్పుకొచ్చింది.
