ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే అందరూ చెప్పే పేరు లయ. బాలనటిగా 'భద్రం కొడుకో' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, 'స్వయంవరం' సినిమాతో హీరోయిన్‌గా మారి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ తర్వాత 'ప్రేమించు', 'మనసున్న మారాజు', 'హనుమాన్ జంక్షన్', 'శివరామరాజు' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడి సినిమాలకు దూరమైన లయ, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ.. బిజీ!
చాలా కాలం తర్వాత రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ'లో మెరిసిన లయ, ఇటీవల నితిన్ నటించిన 'తమ్ముడు' మూవీతో ఫుల్ లెంగ్త్ రీ-ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె నటించిన చిత్రం 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస'. ఈ సినిమాలో విలక్షణ నటుడు శివాజీతో కలిసి లయ కీలక పాత్రలో నటించారు. ప్రమోషన్లలో భాగంగా ఆమె పంచుకున్న విశేషాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వారసురాలి ఎంట్రీపై క్లారిటీ..
ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన కుమార్తె శ్లోక గురించి లయ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శ్లోకకు నటనపై చాలా ఆసక్తి ఉందని, ఇప్పటికే ఆమె కళలపై పట్టు సాధిస్తోందని తెలిపారు. గతంలోనే రవితేజ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. సరైన కథ, మంచి అవకాశం వస్తే కచ్చితంగా ఆమెను వెండితెరకు పరిచయం చేస్తాను. ప్రేక్షకులు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి అని లయ మనసులో మాట బయటపెట్టారు. తన కూతురు శ్లోక ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సోషల్ మీడియాలో శ్లోక హవా
నిజానికి శ్లోక ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రిటీ. తన తల్లి లయతో కలిసి చేసే డాన్స్ వీడియోలు, రీల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. శ్లోక క్లాసికల్ డాన్స్‌లో కూడా ప్రావీణ్యం సంపాదించింది. లయ అభిమానులు సైతం "జూనియర్ లయ వచ్చేస్తోంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు తల్లిగా, ఇటు నటిగా లయ తన బాధ్యతలను నెరవేరుస్తూనే, తన వారసురాలిని వెండితెరకు పరిచయం చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి త్వరలోనే ఈ 'వారసురాలు' హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి!
