వాషింగ్టన్: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది..? ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందా..? లేక తొందరగానే ఆగిపోతుందా..? ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఈ టాపిక్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. మరోవైపు ఇరాన్ ధీటుగా ప్రతి దాడులు చేస్తుండటంతో ఈ వార్ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం ముగింపుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, తాను ఇద్దరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తాను, నెతన్యాహు లేకుంటే ఇజ్రాయెల్‌ను ఇరాన్ నాశనం చేసి ఉండేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకున్న ఇరాన్‌ను ముందుగానే మేం నాశనం చేశామని పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులు నిలిపేయాలని నిర్ణయించుకుంటే ఇజ్రాయెల్ కూడా అటాక్స్ ఆపేయొచ్చన్నారు.
మరోవైపు.. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్రమయ్యాయి. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆదివారం (మార్చి 8) తెల్లవారుజామున టెహ్రాన్ పరిసరాల్లోని 5 కీలక చమురు నిల్వ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆయిల్ డిపోలు పేలిపోయి, అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. టెహ్రాన్ వీధులంతా ఎటుచూసినా మంటలు వ్యాపించాయి. సిటీపై ఆకాశంలో వందల మీటర్ల పొడవునా దట్టమైన నల్లని పొగలు కమ్మేయడంతో తెల్లవారినా సూర్యుడు కనిపించని భయానక పరిస్థితి నెలకొంది.
ఇరాన్ పై "మున్ముందు మరిన్ని సర్ ప్రైజింగ్ అటాక్స్ ఉంటాయి" అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల్లో నలుగురు ట్యాంకర్ డ్రైవర్లు చనిపోయారు. టెహ్రాన్ లోని ఖుద్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ను కూడా బాంబులతో పేల్చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్‌తో పాటు అల్బ్ రోజ్, యాజ్ద్, ఇస్ఫహాన్ లోనూ ఇజ్రాయెల్, అమెరికా బలగాలు దాడులు చేశాయి.
