- బర్త్ రైట్ సిటిజన్‌షిప్ సరైనదే
- అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రెసిడెంట్ ట్రంప్‌కు భారీ షాక్
- యూఎస్ గడ్డపై పుట్టేనోళ్లందరికీ ఆటోమేటిక్‌గా పౌరసత్వం
- వలసదారుల పిల్లలకూ ఇది వర్తిస్తుంది
- రాజ్యాంగంలోని 14వ సవరణ, కింది కోర్టుల తీర్పులను
- సమర్థించిన సుప్రీం.. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కొట్టివేత
- 6–3 మెజారిటీతో జడ్జిల తీర్పు.. మెజారిటీ తీర్పును
- రాసిన సుప్రీం చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్
- ఇది చెత్త తీర్పు.. ఈజీగా చట్టం తీసుకొస్తం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. యూఎస్ గడ్డపై జన్మించినవారికి ఆటోమేటిక్‌గా పౌరసత్వం పొందే హక్కు లభిస్తుందని సంచలన తీర్పును ప్రకటించింది. వలసదారులు, తాత్కాలికంగా నివసిస్తున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించదంటూ ప్రెసిడెంట్ ట్రంప్ గతంలో జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కోర్టు మంగళవారం కొట్టివేసింది. తల్లిదండ్రుల వలస హోదాతో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించే పిల్లలకు ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం లభిస్తుందంటూ రాజ్యాంగంలో పేర్కొన్న ‘బర్త్‌రైట్ సిటిజన్‌షిప్’ సూత్రాన్ని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని జడ్జిలు.. 6–3 మెజారిటీతో ఈ తీర్పును ఆమోదించారు. ఈ తీర్పులో అధిక భాగాన్ని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ రాశారు.
‘‘అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు అమెరికా అధికార పరిధి(జ్యురిస్‌డిక్షన్)కి లోబడి ఉంటారు. 1868లో ఆమోదించిన అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ పౌరసత్వ నిబంధన ప్రకారం.. అమెరికాలో జన్మించిన లేదా పౌరసత్వం పొందిన, దాని అధికార పరిధికి లోబడి ఉన్న వ్యక్తులందరూ అమెరికా పౌరులు”అని స్పష్టం చేశారు. “పౌరసత్వం అనేది, అప్పుడు, ఇప్పుడు కూడా హక్కులను కలిగి ఉండే హక్కు, మన రాజకీయ సమాజంలో స్వేచ్ఛగా పాల్గొనే హక్కు. 14వ సవరణ రూపకర్తలు ఆ వాగ్దానాన్ని ‘ఈ దేశంలో జన్మించిన ప్రతి స్వేచ్ఛా వ్యక్తికి’ విస్తరించారు. మేం ఈ రోజు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాం” అని ఆయన పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ అభిప్రాయంతో నలుగురు జడ్జిలు పూర్తిగా ఏకీభవించగా.. ఒక జడ్జి మాత్రం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14వ సవరణను ఉల్లంఘిస్తుందని తాను నమ్మడం లేదన్నారు. కానీ, 1940 నాటి ఫెడరల్ చట్టానికి ట్రంప్ ఆర్డర్ వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక మిగిలిన ముగ్గురు జడ్జిలు మాత్రం ట్రంప్ ఆర్డర్‌ను పూర్తిగా సమర్థించారు. ‘ట్రంప్ వర్సెస్ బార్బరా’గా పిలిచే ఈ కేసు తీర్పులో జస్టిస్ శామ్యూల్ అలిటో స్పందిస్తూ.. ‘‘కోర్టు తీవ్రమైన పొరపాటు చేసింది” అని రాశారు.
జిల్లా కోర్టుల తీర్పులనూ సమర్థించిన సుప్రీం..
అమెరికాలోకి అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపేందుకుగాను ట్రంప్ తన రెండో టర్మ్ మొదటి రోజున (జనవరి 20, 2025న) బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఆ ఉత్తర్వు అమలులోకి వచ్చిన 30 రోజుల తర్వాత, తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా వలస వచ్చినా లేదా పత్రాలు లేని కార్మికులుగా ఉన్నా, అమెరికాలో జన్మించే పిల్లలకు పౌరసత్వ పత్రాలను జారీ చేయడానికి అర్హత లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ట్రంప్ ఉత్తర్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని పలువురు అమెరికా జిల్లా కోర్టు జడ్జిలు తీర్పు ఇచ్చారు. ఆ ఉత్తర్వు అమలులోకి రాకుండా అడ్డుకునే ఇంజంక్షన్లను (నిషేధాజ్ఞలను) రెండు ఫెడరల్ అప్పీలేట్ సర్క్యూట్ కోర్టులు సమర్థించాయి. ఈ ఉత్తర్వు చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో గత ఏప్రిల్‌లో జరిగిన మౌఖిక వాదనలకు కూడా ట్రంప్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. పౌరసత్వంపై విస్తృతంగా ఆమోదం ఉన్న అభిప్రాయం తప్పని ఆయన ప్రభుత్వం వాదించింది. పౌరులు కాని వారి పిల్లలు అమెరికా అధికార పరిధికి లోబడి ఉండరని, అందువల్ల వారికి పౌరసత్వానికి అర్హత లేదని పేర్కొంది. అయితే, ట్రంప్ ఉత్తర్వులను కొట్టివేయడంతోపాటు కింది కోర్టుల తీర్పులనూ తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది.
ఇది చెత్త తీర్పు: ట్రంప్
సుప్రీంకోర్టు తీర్పు దేశానికి చాలా చెడ్డ విషయమని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. తీర్పు వెలువడిన తర్వాత ఆయన ట్రూత్ సోషల్‌లో స్పందించారు. ‘‘అధ్యక్షుడి మద్దతుతో కాంగ్రెస్‌లో చట్టం ద్వారా ఈ తీర్పును మనం సులభంగా భర్తీ చేయవచ్చు. సుదీర్ఘమైన, గజిబిజిగా ఉండే రాజ్యాంగ సవరణ ఏదీ అవసరం లేదు. మన దేశానికి ఖరీదైన, అన్యాయమైన బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను ముగించడానికి కాంగ్రెస్ ఈ రోజే పని ప్రారంభించాలి. వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
