ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీప తీర ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఎండే పట్టానానికి వాయువ్యంగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో, సముద్ర అంతర్భాగంలో ఈ భూకంప కేంద్రం ఉంది. యూఎస్జీఎస్ దీని లోతును దాదాపు 10 కిలోమీటర్లుగా అంచనా వేయగా.. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ఇది 35 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు వెల్లడించింది.
ఈ పెను ప్రకంపనలతో ఇండోనేషియా వాతావరణ, భూభౌతికశాస్త్ర సంస్థ అప్రమత్తమైంది. తూర్పు నుసా టెంగారా, దక్షిణ సులవేసి, పశ్చిమ నుసా టెంగారా, ఆగ్నేయ సులవేసితో సహా పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు వెంటనే అప్రమత్తమై బీచ్‌లు, నది పరీవాహక ప్రాంతాలకు దూరంగా ఉండాలని, సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు అత్యవసర విజ్ఞప్తి చేశారు.
ప్రధాన భూకంపం సంభవించిన తర్వాత అర్ధగంట వ్యవధిలోనే వరుసగా 3 బలమైన ప్రకంపనలు కూడా నమోదయ్యాయి. అవి రిక్టర్ స్కేలుపై 5.9, 5.6, 6.1 తీవ్రతతో ప్రకంపనలను సృష్టించాయని అమెరికా వెల్లడించింది. ఈ తీవ్రమైన భూకంపం కారణంగా దాదాపు 5 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ప్రకంపనలకు గురయ్యారని అంచనా వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తుంటే భారీగానే ఆస్తి నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ వీడియోల్లో భవనాలు కుప్పకూలటంతో పాటు ప్రజలు భయంతో పడిగెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మొయూరే నౌకాశ్రయంలో ఒక భవనం కుప్పకూలినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, ద్వీపాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా సునామీ హెచ్చరిక కేంద్రం స్పష్టతనిచ్చింది. పసిఫిక్ మహాసముద్రపు "రింగ్ ఆఫ్ ఫైర్" ప్రాంతంలో ఇండోనేషియా ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2004లో సుమత్రా తీరంలో వచ్చిన 9.1 తీవ్రత భూకంపం, సునామీ లక్షలాది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. అలాగే 2018లో లాంబోక్, సులవేసి ప్రాంతాల్లో.. 2022లో పశ్చిమ జావాలో వచ్చిన భూకంపాలు భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. అందుకే ప్రస్తుత భూకంపంపై ప్రజలు ఆందోళన చెదుతున్నారు అక్కడ.
