గల్ఫ్ సంక్షోభం సెగలు భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో.. ఈ రెండు దేశాలు తీవ్రమైన విద్యుత్, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తమ వద్ద ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలను ఆదా చేసేందుకు యూనివర్సిటీలను మూసివేయడం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వటం వంటి అత్యవసర నిర్ణయాలను ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.
యూనివర్సిటీలకు సెలవులు..
బంగ్లాదేశ్‌లో ఇంధన కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను సోమవారం నుంచి మూసివేయాలని ఆదేశించింది. రాబోయే ఈద్-ఉల్-ఫితర్ సెలవులను ముందుగానే ప్రకటించి, క్యాంపస్‌లలో విద్యుత్ వినియోగాన్ని అరికట్టాలని నిర్ణయించింది. కేవలం యూనివర్సిటీలే కాకుండా.. కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ పాఠశాలలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశానికి అవసరమైన ఇంధనంలో 95 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో.. యుద్ధం వల్ల సరఫరా ఆగిపోవడం బంగ్లాదేశ్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే 5 ప్రభుత్వ ఎరువుల తయారీ కర్మాగారాల్లో 4 మూతపడ్డాయి. ఉన్న కొద్దిపాటి గ్యాస్‌ను విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు మళ్లించి, చీకటి నుంచి దేశాన్ని రక్షించే ప్రయత్నం చేస్తోంది అక్కడి ప్రభుత్వం.
పాకిస్థాన్‌లో కరోనా నాటి ఆంక్షలు..
పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. చమురు, గ్యాస్ దిగుమతులు తగ్గడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో అత్యవసర ఇంధన పొదుపు ప్రణాళికను సిద్ధం చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రభుత్వం తిరిగి 'కరోనా కాలం' నాటి కఠిన నిబంధనలను అమలులోకి తెస్తోంది. కొవిడ్ సమయంలో ఎలాగైతే లాక్‌డౌన్ తరహా ఆంక్షలు ఉండేవో, ఇప్పుడు ఇంధనాన్ని ఆదా చేసేందుకు అవే పద్ధతులను పాటిస్తోంది.
కార్పొరేట్ ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్..
విద్యాసంస్థలకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ సమావేశాలను కూడా వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు సెలవు దినాలను పెంచడం, ప్రైవేట్ వాహనాల రాకపోకలను నియంత్రించడం వంటి చర్యలు చేపడుతోంది. పెట్రోల్ అక్రమ నిల్వలు, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.
ఈ రెండు దేశాల ఆందోళనకు ప్రధాన కారణం 'హార్ముజ్ జలసంధి'. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గం యుద్ధం వల్ల మూతపడితే.. దిగుమతులు పూర్తిగా నిలిచిపోతాయని పాక్, బంగ్లాదేశ్ భయపడుతున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఇప్పుడు సరఫరా కూడా నిలిచిపోతే జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుందనే భయంతో ముందస్తుగా ఈ పొదుపు చర్యలు చేపడుతున్నాయి. మొత్తం మీద.. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా, దాని ప్రభావం ఆసియా దేశాలను గడగడలాడిస్తోంది.
