ఇండియా క్రికెట్‎ను నాశనం చేసింది: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎పై అక్తర్

ఇండియా క్రికెట్‎ను నాశనం చేసింది: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎పై అక్తర్

ఇస్లామాబాద్: టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‎లో న్యూజిలాండ్‎ను 96 పరుగుల తేడాతో ఓడించి వార్ వన్ సైడ్ చేసింది. ఫైనల్‎లో ఇండియా ఏకపక్ష విజయం సాధించడంపై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ అక్కసు వెళ్లగక్కాడు. డబ్బులతో ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటూ పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశాడు. 

ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అధిపత్యం క్రికెట్‎ను పూర్తి నాశనం చేసిందంటూ టీ20 వరల్డ్ కప్‎లో భారత విజయాన్ని జీర్ణించుకోలేపోయాడు. భారతదేశాన్ని క్రికెట్‎పై ఆధిపత్యం చెలాయించే ధనవంతుడైన పిల్లవాడిగా అక్తర్ అభివర్ణించాడు.  

‘‘పక్క దేశంలో ఒక ధనవంతుడు పేద పిల్లలందరినీ పిలిచి రండి క్రికెట్ ఆడుదాం అంటాడు. మొదట ఎనిమిది జట్లలో నాలుగు జట్లను ఉంచుకుంటారు. తర్వాత అందులో మూడు జట్లను ఇంటికి పంపించి చివరకు నేను గెలిచాను అంటాడు. ఇప్పుడు ఇండియా మనతో చేస్తున్నది కూడా ఇదే. ఇండియా క్రికెట్‎ను పూర్తిగా నాశనం చేసింది’’ అని అక్తర్ ఆక్రోశం వెళ్లగక్కాడు. కాగా, అక్తర్ ఇండియాపై అక్కసు వెళ్లగక్కడం ఇదే తొలిసారి కాదు.

 గతంలో కూడా చాలాసార్లు ఇండియాపై విషం చిమ్మాడు. అక్తర్‎తో పాటు పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ కూడా ఇండియా గెలుపును జీర్ణించుకోలేకపోయాడు. ఇండియా విజయంలో ఎక్కువ పాత్ర న్యూజిలాండ్ బౌలర్లదేనని భారత గెలుపును తక్కువ చేసి మాట్లాడాడు. అమీర్, అక్తర్ వ్యాఖ్యలపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. మీ టీమ్‎కు ఆట రాదు చేత కాదు.. కేవలం గ్రౌండ్ బయట కారుకూతలు కూయడం ఒక్కటే తెలుసని కౌంటర్ ఇస్తున్నారు.