హెచ్ పీవీ వ్యాక్సినేషన్ షురూ.. మహిళలకు 30 రకాల ఉచిత హెల్త్ టెస్టులు

హెచ్ పీవీ వ్యాక్సినేషన్ షురూ.. మహిళలకు 30 రకాల ఉచిత హెల్త్ టెస్టులు

ప్రారంభించిన మంత్రులు దామోదర, సీతక్క
రూ.4 వేల విలువైన వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నామని వెల్లడి    
బస్టాండ్లలో తల్లుల కోసం ప్రత్యేక ఫీడింగ్ రూమ్స్
మహిళా వసతి పోర్టల్, బుక్​లెట్ ఆవిష్కరణ
ఆదివాసీ భవన్​లో మహిళా దినోత్సవం.. 31 మంది పారిశ్రామికవేత్తలకు సన్మానం

హైదరాబాద్, వెలుగు:మహిళల ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం బంజారాహిల్స్‌ లోని కుమరం భీం ఆదివాసీ భవన్‌ లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్​గెస్టులుగా హాజరైన మంత్రులు.. మహిళల కోసం రూపొందించిన పలు ఆరోగ్య, సంక్షేమ పథకాలను స్టార్ట్​చేశారు.

మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్) ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, దాన్ని అడ్డుకునేందుకు బాలికలకు హెచ్‌పీవీ గార్డాసిల్ 4 టీకా పంపిణీని మంత్రులు ప్రారంభించారు. బయట మార్కెట్​లో ఈ టీకా ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఉందని, కానీ ప్రభుత్వం 14 ఏళ్లు నిండిన బాలికలకు ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి దామోదర వెల్లడించారు.

రాష్ట్రంలో ఏటా 3,200 సర్వికల్ క్యాన్సర్ కేసులు వస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఈ టీకాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుటుంబం కోసం రేయింబవళ్లు కష్టపడే మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, వారి కోసమే ఉచిత హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

రాష్ట్రంలోని 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల(ఎస్ హెచ్ జీ) సభ్యులకు టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి 30 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని, డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తున్నామని పేర్కొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన హెల్త్ స్టాల్స్, ఫీడింగ్ కియోస్క్ నమూనాలను మంత్రులు ప్రారంభించారు. 

పొలం నుంచి అంతరిక్షం దాకా: సీతక్క

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయ పనులను 80 శాతం మహిళలే చేస్తున్నరు. అవకాశం ఇస్తే వారు ఆకాశమే హద్దుగా రాణిస్తరు. మేడారం జాతరలో 565 మహిళా సంఘాలు దుకాణాలు పెట్టి రూ.3.5 కోట్ల లాభాలు సాధించి ఔరా అనిపించారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా సంకల్పం’’ అని వెల్లడించారు. మహిళలు ఇప్పపువ్వు లడ్డూల తయారీ నుంచి సోలార్ ప్లాంట్ల నిర్వహణ వరకు అన్నింట్లోనూ దూసుకెళ్తున్నారని కొనియాడారు. 

తల్లులకు ఫీడింగ్ రూములు

 బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో చంటి పిల్లలకు పాలిచ్చేందుకు తల్లులు ఇబ్బంది పడకూడదని, వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఫీడింగ్ కియోస్క్ నమూనాను మంత్రులు ప్రారంభించారు. అలాగే.. ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాల్లో ఉండే మహిళల భద్రత కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ బుక్ చేసుకునేలా ‘మహిళా వసతి’ ఆన్‌ లైన్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఇందిరా మహిళా శక్తి అచీవ్​మెంట్స్ బుక్‌ లెట్‌ ను విడుదల చేశారు.

వినూత్న వ్యాపారాలతో రాణిస్తున్న 31 మంది మహిళలను మంత్రి సీతక్క ఘనంగా సన్మానించి, వారికి రూ.25,000 చొప్పున ఆర్థిక ప్రోత్సాహక చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఉమెన్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్‌ పర్సన్ బండ్రు శోభారాణి, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.