ఒక కొత్త సినిమా విడుదలవుతుందంటే హైదరాబాద్ సిటీలో ఉండే సందడే వేరు. మల్టీప్లెక్స్ల సంగతి కాసేపు పక్కన పెడితే.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల ముందు అభిమానులు చేసే హంగామా అంతాఇంతా కాదు. హైదరాబాద్ సిటీలోని అలాంటి సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో జీడిమెట్ల రంగా థియేటర్ ఒకటి. ఈ థియేటర్ తాత్కాలికంగా మూతపడింది. నష్టాలొచ్చో, కష్టాలొచ్చో కాదు. మైత్రీ థియేటర్స్ జాబితాలోకి కొత్తగా జీడిమెట్ల రంగా థియేటర్ కూడా చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లను.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మైత్రీ థియేటర్స్ లీజుకు తీసుకుని.. రీనోవేషన్ చేసి నడిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ లిస్ట్లోకి జీడిమెట్ల రంగా థియేటర్ చేరింది. మైత్రీ థియేటర్స్ సంస్థ.. జీడిమెట్ల రంగా థియేటర్ను Dolby Cinema థియేటర్గా అప్ గ్రేడ్ చేసి.. ప్రేక్షకులకు సరికొత్త సౌండింగ్, విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. జీడిమెట్ల రంగా థియేటర్ మొత్తం సీటింగ్ కెపాసిటీ 1330. టాలీవుడ్లో ఒక పెద్ద హీరో సినిమా విడుదలైతే హౌస్ ఫుల్ బోర్డులు కనిపించే థియేటర్లలో రంగా థియేటర్ కూడా ఉంటుంది. చింతల్, జీడిమెట్ల ఏరియాల నుంచి ఈ థియేటర్కు ప్రేక్షకులు ఎక్కువగా వెళుతుంటారు.
మాస్ క్రౌడ్ ఎక్కువగా వెళ్లే థియేటర్. మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ సమయంలో, పవన్ కల్యాణ్ OG సినిమా రిలీజ్ టైంలో రంగా థియేటర్ ముందు అభిమానులు చేసిన హంగామాతో ఈ థియేటర్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. క్రాస్ రోడ్స్ థియేటర్ల సందడికి ఏమాత్రం తగ్గని రీతిలో ఇక్కడ సెలబ్రేషన్స్ జరగడమే ఇందుకు కారణం. ఈ సినిమా థియేటర్కు పబ్లిక్ వస్తారో, రారో అనే అనుమానం అక్కర్లేదు. అందుకే.. ఈ థియేటర్ను లీజుకు తీసుకోవాలని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్ణయించుకున్నారు. రంగా థియేటర్ యాజమాన్యంతో లీజు అగ్రిమెంట్ కుదర్చుకున్నారు. ఇలా రంగా థియేటర్ తాత్కాలికంగా మూతపడింది. 2026 మే టైంకు జీడిమెట్ల రంగా థియేటర్లో మళ్లీ బొమ్మ పడుతుందని టాక్.
ఏపీ, తెలంగాణలోని చాలా టౌన్స్లో థియేటర్ యజమానులకు నెలకు రూ. 2 నుంచి 3 లక్షలు చెల్లించి థియేటర్లను మైత్రీ లీజుకు తీసుకున్న సంగతి తెలిసిందే. అదే నగరాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులకు నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ పే చేసి లీజుకు తీసుకుంటున్నారు. బాలా నగర్ విమల్ థియేటర్, ఘట్ కేసర్ జగదాంబ థియేటర్, దిల్ సుఖ్ నగర్ మేఘా థియేటర్, వనస్థలిపురం సంపూర్ణ థియేటర్లను మైత్రీ థియేటర్స్ లీజుకు తీసుకుని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. లీజు వ్యవధి 9 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతి థియేటర్‌కు కోటి రూపాయల దాకా ఖర్చు చేసి రీనోవేషన్ చేసి థియేటర్లను నడిపిస్తున్న విషయం విదితమే.
