కోలీవుడ్ స్టార్ హీరో , తమిళ వెట్రి కళగం ( TVK ) అధినేత దళపతి విజయ్, గ్లామర్ క్వీన్ త్రిష పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లడం.. అక్కడ దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరి మధ్య బంధం కొనసాగుతోందంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత విడాకుల కోసం ఫిటిషన్ దాఖలు చేసిన తరుణంలో ఈ ఫోటోలు ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
వ్యక్తిగత జీవితంతో మీకేం సంబంధం?
ఈ నేపథ్యంలో, సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఈ వివాదంపై తీవ్రస్థాయిలో స్పందించారు. విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలతో సామాన్యులకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ ప్రైవసీ ఉంటుందని, నటులైనా, నాయకులైనా వారు కూడా మనలాంటి మనుషులేనని ఆమె గుర్తు చేశారు. వారి పర్సనల్ లైఫ్ వల్ల సమాజానికి ఏదైనా హాని కలిగితే తప్ప, దానిని చర్చించాల్సిన అవసరం ఎవరికీ లేదు. ప్రజలు అనవసరంగా వారి జీవితాల్లోకి తొంగి చూడటం ఆపేయాలి అని ఖుష్బూ ఘాటుగా చెప్పారు..
రాజకీయాలపై ప్రభావం చూపుతుందా?
విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టి 'తమిళ వెట్రి కళగం' పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వ్యక్తిగత వివాదాలు ఆయన పొలిటికల్ ఇమేజ్‌ను దెబ్బతీస్తాయా? అన్న ప్రశ్నకు ఖుష్బూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రజలు చాలా తెలివైన వారు. ఎవరికి ఓటు వేయాలో, ఎప్పుడు వేయాలో వారికి తెలుసు. వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. ఒక నాయకుడి పనితీరును బట్టి జనం ఆదరిస్తారు కానీ, అతని వ్యక్తిగత విషయాలను బట్టి కాదు అని ఆమె స్పష్టం చేశారు..
►ALSO READ | OTT Movies Releases: మారుతున్న ఓటీటీ లెక్కలు.. నిర్మాతలకు ఎగ్జిబిటర్ల అల్టిమేటం!
గతంలోనూ అదే ప్రచారం!
నిజానికి విజయ్-త్రిషల మధ్య ఏదో ఉందనే ప్రచారం 'లియో' సినిమా సమయం నుండే వినిపిస్తోంది. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులని సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. ఇప్పుడు ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు విజయ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించాలనే ఆమె మాటలకు నెటిజన్ల నుండి కూడా మద్దతు లభిస్తోంది. మొత్తానికి, విజయ్-త్రిషల ఫోటోలు రేపిన దుమారానికి ఖుష్బూ తనదైన శైలిలో ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా? లేక మరిన్ని మలుపులు తిరుగుతుందా? అనేది వేచి చూడాలి..
