మెదక్ జిల్లాలో విషాదం.. పోలీస్ స్టేషన్‌లోనే గుండెపోటుతో కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్

మెదక్ జిల్లాలో విషాదం..  పోలీస్ స్టేషన్‌లోనే గుండెపోటుతో  కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌.. ఈరోజు స్టేషన్‌లో ఉండగానే ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

రమేష్ కుప్పకూలడాన్ని గమనించిన తోటి సిబ్బంది, అధికారులు ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే రమేష్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు.

 విధి నిర్వహణలో ఉంటూ తోటి అధికారి ఇలా గుండెపోటుతో కన్నుమూయడంతో హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో నిశ్శబ్దం ఆవరించింది. రమేష్ అకాల మరణం పట్ల తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.