- ఇద్దరి నుంచి అదనంగా మినహాయించిన చందా మొత్తం తిరిగి చెల్లింపు
- ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా నూతనంగా ఏర్పాటైన ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ శనివారం తొలిసారి సమావేశమైంది. సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన క్యాష్‌లెస్ స్కీమ్‌ను రాబోయే జులై 15 నుంచి ప్రారంభించనున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది.
పథకం అమలుకు సంబంధించిన సంపూర్ణ మార్గదర్శకాలు, సమగ్రమైన నిబంధనలను మరో వారం రోజుల్లోనే విడుదల చేస్తామని రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగులందరికీ మరింత పారదర్శకంగా, వేగంగా వైద్య సేవలు అందుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉద్యోగుల చందాల మినహాయింపుపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
భార్యా భర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన పక్షంలో, ఇకపై ఒకరి నుంచి మాత్రమే చందా తీసుకోవాలని ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో నిబంధనల ప్రకారం ఇద్దరి నుంచి అదనంగా మినహాయించిన చందా మొత్తాన్ని.. తిరిగి సదరు ఉద్యోగులకు చెల్లించేలా త్వరలోనే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
పథకం విజయవంతం కావడానికి వీలుగా వారం రోజుల్లో హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం జరగబోయే తదుపరి బోర్డు మీటింగ్‌లో వివిధ జబ్బులకు సంబంధించిన ప్యాకేజీ రేట్లు, నెట్‌వర్క్ హాస్పిటల్స్ జాబితాను ఖరారు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది.
