- పాతబస్తీలో బీఎల్‌వోలపై బెదిరింపులు
- పథకాల పేరుతో ప్రజలను భయపెట్టొద్దన్న కేంద్ర మంత్రి
- సిటీలో ఉండేవాళ్లంతా ఇక్కడే ఓట్లు నమోదు చేసుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఓటర్ల జాబితాలో పేరుకుపోయిన అక్రమ, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు వణుకు పుడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తప్పుడు ఓట్లను నమ్ముకుని రాజకీయం చేసే పార్టీలే ఈ ప్రక్షాళనను అడ్డుకుంటున్నాయని అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం నాయకులు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పాతబస్తీలో బీఎల్‌వోలను ఎంఐఎం నాయకులు బెదిరిస్తున్నారని.. ఇంటింటి సర్వేకు వెళ్లొద్దని, ఫారాలు తమకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. మజ్లిస్ కనుసైగల్లోనే ఈ ప్రక్రియ జరగాలనుకోవడం మూర్ఖత్వమని, అధికారులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్థానీయులు అక్రమంగా నివసిస్తున్నారని, వారికి ఓటర్ ఐడీలు కూడా రావడం వెనుక కొన్ని పార్టీల అండదండలు ఉన్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.
అక్రమ వలసదారుల ఓట్లు పోతాయనే భయంతోనే ఈ ప్రక్రియను మతంతో ముడిపెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని విమర్శించారు. ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు.
ఓటుకు, పథకాలకు సంబంధం లేదు..
ఓటు తీసేస్తే పెన్షన్లు రావని, రేషన్ కార్డులు కట్ అవుతాయని, భూములు పోతాయని గ్రామాల్లో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయపెడుతోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు ఎక్కడ ఉందనే దానికి, పథకాలకు సంబంధం లేదన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వాళ్లు ఇక్కడే ఓటు నమోదు చేసుకోవాలని.. ఇక్కడ ఆస్తులు, వ్యాపారాలు పెట్టుకుని ఓటు మాత్రం పక్క ఊర్లో ఉంచుకోవడం సరికాదన్నారు.
హైదరాబాద్‌ను కాపాడుకోవాలంటే ఇక్కడ ఓటు నమోదు చేసుకోవాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణలో సర్ ప్రక్రియను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమేనని అన్నారు. అయినా, దీన్ని ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. సొంత ప్రభుత్వ ఉద్యోగులపైనే సీఎంకు నమ్మకం లేదా? ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న బీఎల్‌వోలను ఇందిరమ్మ చీరల పంపిణీకి వాడుకోవడం ఏంటి? ఇది నియమావళికి విరుద్ధమని ఫైర్ అయ్యారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్రమ ఓట్ల తొలగింపు మాత్రం ఆగదన్నారు.
