మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ కుదింపు

మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ కుదింపు


ప్రాణహాని లేని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు ఉపసంహరణ
మాజీ పోలీస్ అధికారులకూ గన్‌‌మెన్ల కుదింపు, కార్లు అప్పగించాలని సూచన
ఇప్పటికే 100 మంది గన్‌‌మెన్లను రిలీవ్‌‌ చేయాలని సూచించిన రివ్యూ కమిటీ

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు సహా దాదాపు 50 మందికి రాష్ట్ర పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ సెక్యూరిటీని తొలగించింది. గన్‌‌మెన్లను తప్పించడంతో పాటు సెక్యూరిటీ వింగ్‌‌కు కేటాయించిన వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే సంబంధిత మాజీ ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చింది. గన్‌‌మెన్లు ఆయా యూనిట్లలో రిపోర్ట్‌‌ చేయాలని సూచించింది. దీంతో 100 మందికిపైగా పోలీస్ సిబ్బంది గన్‌‌మెన్లుగా రిలీవ్‌‌ కానున్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే గ్రేహౌండ్స్ సిబ్బందిని ట్రాఫిక్ సహా తదితర విభాగాల్లో వినియోగిస్తున్నారు. 

ఒక్కొక్కరికి ఇద్దరు గన్‌‌మెన్లు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 600 మందికి పైగా పోలీస్ సిబ్బంది మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఆఫీసర్ల వద్ద సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేల వద్ద ఇద్దరు చొప్పున, కార్పొరేషన్ చైర్మన్ల వద్ద ఒక్కరు.. ఇలా కేటగిరీల వారీగా డ్యూటీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల భద్రతపై సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తుంటుంది.

ఇందులో భాగంగా మాజీ పోలీసు అధికారులకు సహా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు సంబంధించి భద్రతను సమీక్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల స్థానిక యూనిట్‌‌ అధికారుల నుంచి నివేదికలు సేకరించింది. వాటి ఆధారంగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రాణహాని లేని ప్రజాప్రతినిధుల వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని తొలగించడంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్లను స్వాధీనం చేసుకుంటున్నారు. 

భద్రత తగ్గింపుపై డీజీపీకి లెటర్​ రాసిన

కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ హయాంలో పోలీస్‌‌ అధికారిగా పనిచేశా.26 ఏండ్లు దేశం కోసం పని చేశా. నాపై ఇప్పటి వరకు మూడు సార్లు హత్యాయత్నం జరిగింది. గతంలో ఎప్పుడూ సెక్యూరిటీ తగ్గించలేదు. రేవంత్ రెడ్డి సోదరుడికి నలుగురు గన్‌‌మెన్లు ఇచ్చారు. ఆయన ఏమైనా తెలంగాణ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరా?. బండి భగీరథ్​ అంశంలో సీఎం చేసిన తప్పును బయటపెడితే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నరు.

నా గుండుపై రేవంత్ రెడ్డి కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి నన్ను చంపినా, చంపే ప్రయత్నం చేసినా భయపడ. నాకు రాష్ట్రపతి శౌర్య పతకం వచ్చింది. మరో 10 మంది రిటైర్డ్ అధికారులను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారు. భద్రత తగ్గింపుపై డీజీపీకి లెటర్ రాశా.  - ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్‌‌‌‌