- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
లండన్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్–ఎలో భాగంగా ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టోర్నీలో ఇండియాను ఫీల్డింగ్, బ్యాటింగ్ వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఓపెనర్లు స్మృతి మంధాన (167 పరుగులు), షెఫాలీ వర్మ (145 పరుగులు) రాణిస్తున్నప్పటికీ.. మిడిలార్డర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (85), జెమిమా రోడ్రిగ్స్ (58) నిలకడగా ఆడలేకపోతున్నారు. వీళ్లు కచ్చితంగా ఫామ్‌లోకి రావాల్సిందే. దీనికి తోడు గత రెండు మ్యాచ్‌ల్లో ఫీల్డర్లు ఏకంగా ఆరు క్యాచ్‌లు వదిలేశారు.
బంగ్లాదేశ్‌పై గెలిచినప్పటికీ నాలుగు క్యాచ్‌లు చేజార్చడం ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి 4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఇండియాకు కలిసొచ్చే అంశం. మిగతా బౌలర్లు కూడా ఆమెకు సహకారం అందించాల్సి ఉంది. మరోవైపు ఇదే గ్రూప్‌లో సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాపై సఫారీలకు ఉన్న రికార్డు (12 మ్యాచ్‌ల్లో 9 విజయాలు) దృష్ట్యా ఆ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి ఇండియా సెమీస్ చేరాలంటే ఆసీస్‌పై కచ్చితంగా గెలవాలి. ఓడిపోతే మాత్రం టీమిండియా టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. మరోవైపు ఎనిమిది పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా మెరుగైన రన్ రేట్ (4.724) కారణంగా సెమీస్‌కు చేరుకుంటుంది.
