బీఆర్ఎస్ లాక్కున్న సొసైటీ భూమిని ఇవ్వాలి: తెలంగాణ పెన్షనర్ల సంఘం

బీఆర్ఎస్ లాక్కున్న సొసైటీ భూమిని ఇవ్వాలి: తెలంగాణ పెన్షనర్ల సంఘం

ముషీరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా వెనక్కి తీసుకున్న సొసైటీ ఇండ్ల స్థలాలకు కేటాయించిన భూమిని తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కోరింది. శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు కనకం కొమురెల్లి, కార్యదర్శి తూము అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వే నంబర్లు 36, 37లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇండ్ల స్థలాల కోసం భూమి కేటాయించిందని గుర్తుచేశారు.

2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే ఇండ్లు నిర్మించుకోలేదన్న కారణంతో సొసైటీకి చెందిన 189.11 ఎకరాలను వెనక్కి తీసుకుని పెన్షనర్లకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఆ భూమిని సొసైటీకి కేటాయించాలని సీఎం  రేవంత్​రెడ్డిని విజ్ఞప్తి చేశారు.