హ్యూస్టన్: ఫిఫా వరల్డ్ కప్‌లో కేప్ వెర్డె సంచలనం సృష్టించింది. అరంగేట్రం టోర్నీలోనే నాకౌట్ రౌండ్‌లోకి అడుగుపెట్టి అద్భుతం చేసింది. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న దేశంగా కేప్ వెర్డె రికార్డులకెక్కింది. గ్రూప్–హెచ్‌లో భాగంగా శనివారం సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచ్‌ను 0–0తో డ్రా చేసుకోవడం ద్వారా కేప్ వెర్డె నాకౌట్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లను ఈ జట్టు డ్రా చేసుకోవడం విశేషం.
కేవలం 5 లక్షల జనాభా కలిగిన కేప్ వెర్డె.. తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ను స్పెయిన్ 0–0తో, తర్వాత ఉరుగ్వేను 2–2తో నిలువరించింది. కేప్ వెర్డె విజయాల్లో 40 ఏళ్ల సీనియర్ గోల్ కీపర్ వోజిన్హా కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి జట్లలోని స్టార్ ప్లేయర్లు గోల్స్ కొట్టకుండా అడ్డుగోడలా నిలిచాడు.
సౌదీతో జరిగిన మ్యాచ్‌లోనూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కేప్ వెర్డె కీలక టైమ్‌లో గోల్స్ కాకుండా అడ్డుకుంది. వచ్చే నెల 3న మయామిలో జరిగే నాకౌట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో కేప్ వెర్డె తలపడుతుంది.
ఉరుగ్వే ఔట్.. నాకౌట్ కు స్పెయిన్
గ్వాడలజారా: మాజీ చాంపియన్ ఉరుగ్వేకు ఈ వరల్డ్ కప్‌లో ఊహించని షాక్ తగిలింది. గ్రూప్–హెచ్ చివరి లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్ 1–0తో ఉరుగ్వేను ఓడించి నాకౌట్ రౌండ్‌కు దూసుకెళ్లింది. దాంతో ఉరుగ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఉరుగ్వే ఒక్క విజయం కూడా సాధించలేదు. మ్యాచ్ 42వ నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ అలెక్స్ బేనా కొట్టిన షాట్‌ను అడ్డుకోవడంలో ఉరుగ్వే కీపర్ ఫెర్నాండో ముస్లేరా ఘోరంగా విఫలమయ్యాడు.
ఈ టోర్నీలో అతను చేసిన మూడో పెద్ద తప్పిదం ఇది. దాంతో సెకండాఫ్‌లో సెర్గియో రోచెట్ కీపర్‌గా వచ్చాడు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న ఉరుగ్వే.. ఈ టోర్నీలో ఇప్పటివరకు నిష్క్రమించిన అత్యుత్తమ ర్యాంక్ జట్టుగా నిలిచింది. మ్యాచ్ చివరి నిమిషాల్లో పెనాల్టీ కోసం ఉరుగ్వే ప్లేయర్లు ఆందోళన చేయడంతో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొంది.
డెంబెలే హ్యాట్రిక్
ఫాక్స్‌బరో: స్టార్ ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలే (7, 20, 32వ ని) హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో.. గ్రూప్–ఐ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4–1తో నార్వేపై గెలిచింది. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో డెంబెలే గోల్డెన్ బూట్ రేసులోకి దూసుకొచ్చాడు. 7వ నిమిషంలో కైలిన్ ఎంబాపె ఇచ్చిన పాస్‌ను గోల్‌గా మలిచిన డెంబెలే.. 12 నిమిషాల వ్యవధిలో మరో రెండు గోల్స్ కొట్టి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. దాంతో వరల్డ్ కప్ చరిత్రలో తొలి హాఫ్‌లో హ్యాట్రిక్ నమోదు కావడం 1994 తర్వాత ఇదే తొలిసారి.
ఇంజూరీ టైమ్‌లో డెసిరై డౌ (90+4వ ని) మరో గోల్ కొట్టాడు. థెలో ఆస్‌గార్డ్ (21వ ని) నార్వేకు ఏకైక గోల్ అందించాడు. ఈ రెండు జట్లు ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించడంతో కీలక ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చి మిగతా వాళ్లను పరీక్షించారు.
