రాష్ట్రంపై బీజేపీ ఫోకస్.. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యాచరణ

రాష్ట్రంపై బీజేపీ ఫోకస్.. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యాచరణ
  • నేటి నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన 
  • పది జిల్లాల పార్టీ ఆఫీసుల ప్రారంభం.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌‌‌లో భారీ బహిరంగ సభ
  • 15 వేల మంది కార్యకర్తలతో ‘విజయ సంకల్పం’
  • రాష్ట్రంలో అధికారానికి ఈ సభ నుంచే శంఖారావం: రాంచందర్ రావు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్‌‌‌‌లను కూకటివేళ్లతో పెకిలిస్తామని కామెంట్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్​పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ఇటీవలే రాష్ట్రానికి వచ్చివెళ్లగా.. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రస్తుతం బీజేపీకి అర్బన్​లో కాస్తో కూస్తో పట్టు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఏమాత్రం బలంగా లేదు.

పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ ఇటీవలి మున్సిపల్​ ఎన్నికల్లోనూ చతికిలపడడంపై హైకమాండ్ ఆగ్రహంతో ఉన్నది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలకు 8 స్థానాలను గెలుచుకోవడాన్ని బట్టి పార్టీకి, ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉందని.. కానీ, రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన నేతల మధ్య సమన్వయలోపం వల్లే పార్టీ అధికారపీఠాన్ని అందుకోలేకపోతోందని అధిష్టానం గ్రహించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా బీజేపీలో కీలక పదవుల్లో ఉన్న నేతల పనితీరుపై హైకమాండ్​ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నితిన్​నబిన్​ తన పర్యటనలో భాగంగా ముఖ్యనేతల నుంచి కార్యకర్తల వరకు అందరితో వేర్వేరుగా సమావేశమై, రాబోయే  జీహెచ్​ఎంసీ సహా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది.  మరోవైపు వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులను కలుపుకొని పోవడంలో పాత నాయకులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. దీంతో నేతల మధ్య సమన్వయానికి నితిన్​నబీన్​ఏ మంత్రదండం ప్రయోగిస్తారనేది ఆసక్తి రేపుతోంది. 

నితిన్ నబీన్ షెడ్యూల్​ ఇదీ.. 
ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ చేరుకోనున్న నితిన్ నబీన్.. రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన 10 జిల్లాల పార్టీ ఆఫీసులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షుల భారీ సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. అదే రోజు రాత్రి పార్టీ స్టేట్ ఆఫీసులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయి రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

29న ఉదయం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావుకు చెందిన వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో స్టూడెంట్ కాన్ క్లేవ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత భువనగిరి మీదుగా వరంగల్ చేరుకొని అక్కడ లంబాడ, కోయ, చెంచు, గోండ్స్ తదితర ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ ప్రెసిడెంట్లతో నిర్వహించే భేటీలో పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చిస్తారు. 30న ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌లో జరిగే స్టేట్ వర్కింగ్ కమిటీ, ఆఫీస్ బేరర్స్ సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేసి, ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

కార్యకర్తల్లో ‘విజయ సంకల్పం’
నితిన్ నబీన్ పర్యటనలో భాగంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌‌‌లో భారీ విజయ సంకల్ప సమ్మేళనం  నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌‌‌లో జరుగుతున్న సభ ఏర్పాట్లను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

నితిన్ నబీన్ పర్యటన రాష్ట్ర బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సభకు జీహెచ్ఎంసీ, మల్కాజగిరి, సైబరాబాద్ పరిధిలోని బూత్ స్థాయి అధ్యక్షులు, ఏజెంట్లు, ముఖ్య నేతలు కలిపి సుమారు15వేల మంది హాజరుకానున్నారని వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలో జాతీయ అధ్యక్షుడు ఈ స్థాయిలో సభ నిర్వహించడం ఇదే మొదటిసారి అని, ప్రధాని మోదీ చెప్పినట్టు తెలంగాణలో అధికారం సాధించడమే మా తదుపరి లక్ష్యమని, దానికి ఈ సభ నుంచే శంఖారావం పూరిస్తామని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని అడ్డుకోలేవని రాంచందర్ రావు తెలిపారు. ఈ పార్టీల లోపాయికారీ ఒప్పందాలు ప్రజలకు అర్థమయ్యాయని,  మార్పు కోరుకుంటున్న తెలంగాణ ప్రజలకు బీజేపీయే ఏకైక ప్రత్యామ్నాయమని చెప్పారు. ఆ మూడు పార్టీలను కూకటివేళ్లతో పెకిలిస్తామన్నారు.

ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద జరిగిన సమీక్షలో బీజేపీ రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జ్ అభయ్ పాటిల్, ఎంపీ రేఖా శర్మ తదితరులు పాల్గొని పలు సూచనలు చేశారు. కాగా, బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎయిర్‌‌‌‌లైన్ రంగానికి చెందిన ప్రముఖులు హరికృష్ణన్, చంద్ర మోహన్  తదితరులు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.