నా బండికే అడ్డం వస్తావా.. విచక్షణ జ్ఞానం కోల్పోతున్న వాహనదారులు.. 15 నిమిషాలు ముందు బయల్దేరితే ఏంటి..?

నా బండికే అడ్డం వస్తావా.. విచక్షణ జ్ఞానం కోల్పోతున్న వాహనదారులు.. 15 నిమిషాలు ముందు బయల్దేరితే ఏంటి..?

హైదరాబాద్ యువతలో పెరుగుతున్న ఈగో(అహంకారం) సోషల్ స్టేటస్ భావనలు కూడా గొడవలకు ఆజ్యం పోస్తున్నాయి. ‘నా బండికే అడ్డం వస్తావా?’,  ‘నా లగ్జరీ కార్‌‌‌‌‌‌‌‌నే ఓవర్‌‌‌‌‌‌‌‌టేక్ చేస్తావా? అనే ఈగోలు నడిరోడ్డుపై ఘర్షణలకు దారితీస్తున్నాయి. ప్రస్తుత లైఫ్​స్టైల్​లో డిజిటల్ స్క్రీన్ల వాడకం పెరగడం వల్ల యువతలో సహజంగానే ఓపిక తగ్గిపోయింది. ఏ విషయాన్నైనా తట్టుకోలేని సున్నిత మనస్తత్వం, తక్షణమే స్పందించాలనే ప్రవర్తనగా మారి రోడ్డుపై హింసకు ప్రేరేపిస్తోంది

విచక్షణ జ్ఞానం కోల్పోయి..

ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో గంటల తరబడి చిక్కుకుపోవడం వల్ల మెదడులో  ‘కార్టిసోల్’, ‘అడ్రినలిన్’ వంటి స్ట్రెస్ హార్మోన్లు విపరీతంగా విడుదలవుతాయని, ఇవి ఎప్పుడూ ‘ఫైట్ లేదా ఫ్లైట్’(పోరాడు లేదా పారిపో) అనే ఉద్వేగ స్థితిలో ఉంచుతాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు మెదడులోని విచక్షణ జ్ఞానం పనిచేయడం తగ్గిపోతుందంటున్నారు.

ఫలితంగా, పక్క వాహనదారుడు చేసిన చిన్న పొరపాటు కూడా పెద్ద నేరంలా కనిపిస్తుందని, తమ సొంత జీవితాల్లో ఉండే వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిడులను కూడా డ్రైవర్లు రోడ్డుపై చూపిస్తారని అంటున్నారు. అందుకే అత్యంత చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలకు దిగుతుంటారని అంటున్నారు.  

15 నిమిషాల ముందు బయల్దేరితే..

భయంకరమైన రోడ్ రేజ్ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే వాహనదారుల ఆలోచనా విధానంలో మార్పు రావడం చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు. ట్రాఫిక్ ఒత్తిడిని అధిగమించడానికి ప్రయాణ సమయం కంటే 15 నిమిషాల ముందే ఇండ్ల నుంచి బయలుదేరడం మంచిదని అంటున్నారు.

డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండటం, కోపం వస్తున్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం వంటి చిన్న చిన్న చిట్కాలు మెదడును ప్రశాంతపరుస్తాయంటున్నారు. రోడ్డుపై ఎవరైనా తప్పుగా డ్రైవ్ చేస్తే, దాన్ని వ్యక్తిగత అవమానంగా తీసుకోకుండా, అవతలి వ్యక్తి అజ్ఞానంగా భావించి వదిలేయడం వల్ల మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చంటున్నారు.  

కేవలం కౌన్సెలింగ్ మాత్రమే కాకుండా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు తగ్గుతాయంటున్నారు. నడిరోడ్డుపై ప్రయాణికులను భయపెట్టేలా ప్రవర్తించేవారిని శిక్షించాలంటున్నారు. ఒకరి కోపం, కొన్ని నిమిషాల అసహనం వల్ల వందలాది వాహనాలు ట్రాఫిక్ ల్లో చిక్కుకుపోతున్నాయని అంటున్నారు.