- హనుమకొండ జిల్లాలో స్టోన్ కట్టింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీల ఇష్టారాజ్యం
- బహిరంగ ప్రదేశాల్లోనే స్లర్రీ వాటర్, డస్ట్ డంపింగ్
- కనిపించని ట్రీట్మెంట్ సిస్టమ్, నేరుగా భూమిలోకి ఇంకుతున్న వ్యర్థ జలాలు
- పట్టించుకోని ఆఫీసర్లు
హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లాలోని గ్రానైట్ కంపెనీలు కాలుష్య కేంద్రాలుగా మారాయి. స్టోన్ బ్లాక్స్ కటింగ్, పాలీషింగ్ సమయంలో వెలువడుతున్న స్లర్రీ (గ్రానైట్ డస్ట్)తో పాటు కెమికల్ వాటర్ ను పంట పొలాల సమీపంలో బహిరంగంగా డంప్ చేస్తున్నాయి. కనీస ట్రీట్ మెంట్ కూడా చేయకుండానే నీటిని బయటకు పంపుతుండడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి.
హనుమకొండ జిల్లాలోని రాంపూర్, ఎల్కతుర్తిలో ఉన్న గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ ఇండస్ట్రీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.
వేల లీటర్ల కెమికల్స్, టన్నుల కొద్దీ స్లర్రీ
హనుమకొండ జిల్లాలోని రాంపూర్, ఎల్కతుర్తి మండల కేంద్రంలో 100 గ్రానైట్ కట్టింగ్, పాలీషింగ్ ఇండస్ట్రీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 123 గ్రానైట్ క్వారీ లీజులు ఉండగా.. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ లోని వివిధ ప్రాంతాల నుంచి గ్రానైట్ బ్లాక్స్ తీసుకొచ్చి ఇక్కడ కట్టింగ్, పాలీషింగ్ చేస్తున్నారు.
గ్రానైట్ ను కట్ చేసిన తర్వాత పాలీషింగ్ ప్రక్రియ లోపగుళ్లు ఏర్పడకుండా ఎపోక్సీ రైసిన్ తో పాటు ఆక్సాలిక్ యాసిడ్, సిరియం ఆక్సైడ్, సిలికాన్ కార్బైడ్ వంటి రసాయనాలు వాడుతుంటారు. ఒక్కో కంపెనీ అవసరాన్ని బట్టి నెలకు ఐదారు వందల లీటర్ల వరకు కెమికల్స్ ఉపయోగిస్తుంటారు. ఇలా రాంపూర్, ఎల్కతుర్తిలోని గ్రానైట్ కట్టింగ్, పాలీషింగ్ ఇండస్ట్రీలు ప్రతినెలా వేల లీటర్ల కెమికల్స్ వినియోగిస్తుండగా, టన్నుల కొద్దీ స్లర్రీ బయటకు వస్తోంది.
కనిపించని ట్రీట్ మెంట్ ప్లాంట్లు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రూల్స్ ప్రకారం.. గ్రానైట్ ప్రాసెసింగ్ లో భాగంగా వెలువడే స్లర్రీ, కెమికల్స్ ను డైరెక్ట్ గా బయటకు వదలకూడదు. ఇండస్ట్రీలు ఎఫ్లుయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని వీటి ద్వారా వ్యర్థాలను శుద్ధి చేసి వాటర్ ను రీసైక్లింగ్ చేయడంతో పాటు స్లర్రీని కాంక్రీట్ లైనింగ్ ఉన్న గుంతల్లోనే డంప్ చేయాలి.
కానీ జిల్లాలోని గ్రానైట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీల్లో సరైన ట్రీట్ మెంట్ వ్యవస్థ లేదు. చాలాచోట్లా ప్లాంట్లు లేకపోగా.. ఒకట్రెండు చోట్ల ఉన్నా అవీ పనిచేయడం లేదు. ఫలితంగా కెమికల్ వాటర్ తో పాటు స్లర్రీ మొత్తాన్ని ఓపెన్ ప్లేసుల్లోనే డంప్ చేస్తున్నారు.
పంటలు, పరిసరాలపై ప్రభావం
గ్రానైట్ ఇండస్ట్రీల నుంచి వెలువడే కెమికల్ వాటర్, స్లర్రీ కారణంగా భూగర్భజలాలు, పరిసరాలు కలుషితం అవుతున్నాయి. దీని కారణంగా పండడం లేదని రాంపూర్, ఎల్కతుర్తి పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కెమికల్ వాటర్, స్లర్రీ, దుమ్ము కారణంగా భూగర్భజలాలు, పర్యావరణ కలుషితం అవుతున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రంగు కలిసిన నీళ్లను బయటకు వదులుతున్నరు
నేను ఐదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న. గతంలో బోరు, బావి నీళ్లు మంచిగుండేవి. గ్రానైట్ కంపెనీలు వచ్చినంక చుట్టుపక్కల పొలాలు లీజుకు తీసుకొని మందులు, రంగులు కలిసిన నీళ్లు ఇష్టమొచ్చినట్లు బయటకు వదులుతున్నరు. ఆ నీళ్లు భూమిలోకి ఇంకి బోర్లు, బావుల్లోకి వస్తున్నయి.
గోపు కొమురయ్య, కౌలు రైతు, సూరారం
