ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న దారుణాలు చూస్తుంటే...బయట ఏదైనా కొనాలన్నా, తినాలన్నా వణుకు పుడుతోంది. కిరాణా సరుకుల్లో అమ్మే సరుకులు మొదలుకొని.. స్టార్ హోటళ్ల వరకు ఎక్కడ చూసినా కల్తీ బాగోతమే. ఇప్పుడు మేడిపల్లి లో మరో దారుణం బయటపడింది. ఓ బేకరీలో తనిఖీలు నిర్వహించిన అధికారులు హానికర కెమికల్స్ గల పదార్థాలతో కేకులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ రోడ్డులో ఉన్న మల్లికార్జున నగర్ లో ఆమ్నామ్స్ బేకరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు. ఈ తనిఖీల్లో హానికర కెమికల్స్ గల పదార్థాలతో కేకులు తయారీ.. కాలం చెల్లిన రంగులు, పొడులు వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు.
ప్రజల ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తున్న కేకులు, కాలం చెల్లిన రంగులు పొడులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అమోనియా పొడి, నిమ్మ పసుపు కృత్రిమ ఆహార రంగు, నారింజ ఎరుపు కృత్రిమ ఆహార రంగు, ఇతర కృత్రిమ రంగులు, కాలం చెల్లిన రమ్‌జామిక్ పొడితో పాటు వాటిని ఉపయోగించి తయారు చేసిన కేకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బేకరీని నిర్వహిస్తున్న అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్‌ను అదుపులోకి తీసుకున్నారు ఎస్‌ఓటీ పోలీసులు. జార్ఖండ్‌కు చెందిన అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్, నిర్మల్‌కు చెందిన బేకరీ యజమాని ముస్తఫాకు నెలవారీగా డబ్బులు చెల్లిస్తూ బేకరీ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న పదార్థాలు, కేకులతో పాటు అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
