భారతీయులపై వైద్య ఖర్చుల భారం ఏటేటా భారీగా పెరుగుతోంది. హెల్త్ కేర్ సేవలు పొందేందుకు ప్రజలు సొంతంగా జేబుల నుంచి చెల్లిస్తున్న మొత్తం 5 ఏళ్లలో ఏకంగా 28.4 శాతం పెరిగింది. 2018-19లో దేశవ్యాప్తంగా ఒక్కొక్కరిపై సగటున రూ.2వేలు155గా ఉన్న అవుట్-ఆఫ్-పాకెట్ ఎక్స్‌పెండిచర్(OOPE).. 2022-23 నాటికి రూ.2వేల 767కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది.
ఏడాది ఏడాదికీ పెరుగుతూనే..
ప్రజల ఆరోగ్య ఖర్చు తగ్గాల్సింది పోయి ప్రతి ఏడాది పెరుగుతూనే వచ్చింది. 2019-20లో తలసరి OOPE రూ.2వేల 289గా ఉండగా.. 2020-21లో రూ.2వేల 415కు, 2021-22లో రూ.2వేల 600కు, 2022-23లో రూ.2వేల 767కు పెరిగింది. అంటే ఆరోగ్యంపై కుటుంబాలు పెట్టే సొంత ఖర్చు క్రమంగా పెరుగుతోందన్నమాట. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న అధిక ఖర్చులకు ఇవి అదనంగా మారుతున్నాయి.
ఆస్పత్రి నుంచి మందుల వరకు.. జేబుకే చిల్లు
OOPE అంటే కేవలం ఆస్పత్రి బిల్లు కాదు. ఇన్సూరెన్స్, ఇతర మార్గాల్లో రీయింబర్స్‌మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇండియన్ ఫ్యామిలీస్ నేరుగా భరించే ఖర్చులన్నీ ఇందులోకి వస్తాయి. ఆస్పత్రి చికిత్స, ఓపీ సేవలు, మందులు, డెలివరీ, వైద్య పరీక్షలు, రవాణా, మెడికల్ పరికరాలు తదితర ఖర్చులు ఇందులో భాగమే. అనారోగ్యం వస్తే ఆదాయంలో ఎక్కువ భాగం వైద్యానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోందో ఈ గణాంకాలు చెబుతున్నాయి.
కేరళలో అత్యధికం.. ఏపీలోనూ అదే తీరు
రాష్ట్రాల విషయానికి వస్తే కేరళ ప్రజలపై వైద్య ఖర్చుల భారం అత్యధికంగా ఉంది. 2022-23లో అక్కడ తలసరి OOPE రూ.8వేల 388గా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే 3 రెట్లకు పైనే. పశ్చిమ బెంగాల్ రూ.4వేల 183, ఆంధ్రప్రదేశ్ రూ.4వేల 117, హిమాచల్ ప్రదేశ్ రూ.4వేల 047, పంజాబ్ రూ.3వేల 829తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ సగటుతో పోలిస్తే ప్రజలు వైద్య ఖర్చుల కోసం సొంతంగా జేబుల నుంచి అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండటం ఆందోళన కలిగించే అంశం.
ALSO READ : మేడిపల్లి పబ్లిక్ కు అలర్ట్: ఈ బేకరీలో కేకులు కొంటున్నారా..?
కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తక్కువ
బిహార్‌లో తలసరి OOPE రూ.1,043గా ఉండగా.. అసోంలో రూ.1,237, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,475గా నమోదైంది. అయితే తక్కువ OOPE అంటే అక్కడ వైద్య సేవలపై ప్రజలకు భారం తక్కువగానే ఉందని మాత్రమే అర్థం చేసుకోవడం సరైంది కాదు. ఆరోగ్య సేవల వాడకం, ప్రభుత్వ వైద్య సదుపాయాల అందుబాటు వంటి అంశాలు కూడా ఈ లెక్కలను ప్రభావితం చేస్తాయి.
ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు నేషనల్ హెల్త్ మిషన్, ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్షా యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా లక్షా 87వేల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.
పథకాలు ఉన్నా.. జేబుపై భారం ఎందుకు?
ఉచిత మందులు, ఉచిత డయాగ్నస్టిక్స్, జన ఔషధి కేంద్రాలు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి స్కీమ్స్ ద్వారా OOPE తగ్గించడమే లక్ష్యమని కేంద్రం చెబుతోంది. అయినప్పటికీ ప్రజల సగటు వైద్య ఖర్చు ఐదేళ్లలో 28.4 శాతం పెరగడం.. దేశంలో వైద్య ఖర్చుల నియంత్రణ, ఇన్సూరెన్స్ కవరేజీపై ఇంకా పెద్ద ప్రశ్నలు ఉన్నాయనే విషయాన్ని బయటపెడుతోంది. అనారోగ్యం ఒక సమస్య అయితే.. దానికి అయ్యే ఖర్చు సామాన్యుడి జేబుకు మరో సమస్యగా మారుతోంది.
