ఇన్‎స్టా యూజర్స్ జాగ్రత్త: అమెరికా నిఘా సంస్థ హెచ్చరికలతో హైదరాబాద్‎లో వ్యక్తిపై కేసు

ఇన్‎స్టా యూజర్స్ జాగ్రత్త: అమెరికా నిఘా సంస్థ హెచ్చరికలతో హైదరాబాద్‎లో వ్యక్తిపై కేసు

సోషల్ మీడియాలో ఏం చేసిన ఏం కాదులే.. మనల్ని ఎవరూ చూడట్లే అనుకునేవారికి ఇది భారీ హెచ్చరిక. సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నారు.. ఎలాంటి కంటెంట్ చూస్తున్నారనే దానిపై నిఘా సంస్థలు కన్నేశాయి. నిషేధిత కంటెంట్ చూసినా.. షేర్ చేసినా ఊచలు లెక్క పెట్టాల్సిందే. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఇన్‎స్టా గ్రామ్‎లో నిషేధిత చైల్డ్ ఫోర్నోగ్రఫీ కంటెంట్ చూడటంతో పాటు షేర్ చేస్తోన్న వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అమెరికా నిఘా సంస్థల హెచ్చరికలతో సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. 

అమెరికా నిఘా సంస్థ (NCMEC) హెచ్చరికలతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‏లో ఓ వ్యక్తి పై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. జీడీమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారానికి చెందిన శానప్ప అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్‎లో నిషేధిత చైల్డ్ ఫోర్న్ వీడియోలు చూస్తున్నాడు. అంతేకాకుండా ఆ లింక్‎లను ఇతరులకు షేర్ చేస్తున్నాడు. అమెరికాకు చెందిన NCMEC సంస్థ ఈ విషయాన్ని పసిగట్టింది. 

వెంటనే ఈ సమాచారాన్ని భారత్‎కు చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB)కు చేరవేసింది. NCMEC అందించిన డిజిటల్ ఆధారాలను ఎన్సీఆర్బీ స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్‎కు అందజేసింది. ఎన్సీఆర్బీ సమాచారంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి ఐపీ అడ్రస్‎తో ఫోన్ నెంబర్ గుర్తించి జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడు శానప్పపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.