నల్లగొండ: ఓటు చోరీని అడ్డుకుంటే దేశంలో బీజేపీ పాలనకు తెరపడినట్లేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 28) మిర్యాలగూడలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ఓటు చోరీ పెనుముప్పు అని అభివర్ణించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాన్ని రాహుల్ గాంధీ ముందుండి నడిపిస్తున్నారని అన్నాడు.
రాహుల్ గాంధీ దేశానికి తదుపరి ప్రధానమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తుందని ఆరోపించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కాంగ్రెస్ జెండాను వీడని కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని.. కార్యకర్తల చెమట, కష్టం, త్యాగాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.
సాగునీటిపై బీఆర్ఎస్ చేస్తున్నదంతా అసత్య, రాజకీయ దురుద్దేశపూరిత ప్రచారమని విమర్శించారు. సాగర్ ఆయకట్టు ప్రాంతం నుంచే ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని అన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షపాతం తగ్గిందన్నారు.
ALSO READ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
క్లిష్ట పరిస్థితుల్లోనూ నాగార్జునసాగర్ జలాలను జాగ్రత్తగా వినియోగిస్తున్నామని.. వేసవి తాగునీటి అవసరాలకు సరిపడా సాగర్ నిల్వలను కాపాడుతున్నామని చెప్పారు. సాగర్ - మిర్యాలగూడ ప్రాంతంలోని ఆరు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామన్నారు. 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
