- నిర్వాసితులు, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలకు ‘థంబ్’ లింక్
- ప్రతీ సర్వే నెంబర్కు ఓటీపీ రావాల్సిందే..
- టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో అప్ లోడ్ అయితలే.. ఓటీపీ రావట్లే..
- ప్రస్తుతం 90 అకౌంట్లకు రూ.4.50 కోట్లు పరిహారం పెండింగ్
- మాన్యువల్ పద్ధతినే అమలు చేయాలని కోరుతున్న ఆఫీసర్లు
యాదాద్రి, వెలుగు: నిర్వాసితులకు భూ పరిహారం పంపిణీలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తరచూ రూల్స్ మారుస్తోంది. నిర్వాసితులకు ఆధార్‌తో పాటు థంబ్ తప్పనిసరి చేసింది. దీంతో పాటు ప్రతీ సర్వే నెంబర్ డిటైల్స్ అప్‌లోడ్‌కు అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోల ‘థంబ్’ తీసుకుంటోంది. కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ ప్రక్రియ ముందుకు సాగక పరిహారం పెండింగ్‌లో ఉంటోంది.
భూ సేకరణ.. పరిహారం ఇలా..
ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ జరుగుతోంది. ఇప్పుడు ప్రధానంగా రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో దాదాపు 164 కిలోమీటర్లు నిర్మాణం కానుంది. సేకరిస్తున్న భూములకు 2022లో వేసిన ప్రైమరీ నోటిఫికేషన్ (పీఎన్) నాటికి పేర్కొన్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం ఎన్హెచ్ఏఐ అందించాల్సి ఉంటోంది.
పరిహార ప్రక్రియలో పలుమార్లు మార్పులు..
పరిహారం చెల్లింపుల విషయంలో ఎన్హెచ్ఏఐ ఇప్పటికే పలుమార్పులు చేసింది. మొదట్లో నిర్వాసితుడి నుంచి ప్రాజెక్టుల కోసం సేకరిస్తున్న భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్స్, ఈసీతో పాటు పరిహారం జమ చేయడానికి బ్యాంక్ పాస్‌బుక్ సేకరించేది. ఆ తర్వాత 2024లో పాన్ కార్డును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటివరకూ పాన్ కార్డులు లేని వాళ్లందరూ కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది.
అనంతరం నిర్వాసితుల వేలిముద్రలతో పాటు ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వచ్చేలా మార్పులు చేసింది. తాజాగా భూ సేకరణలో బాధ్యులైన అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోల ఆధార్‌తో అనుంధానమైన మొబైల్ నెంబర్‌ను ఉపయోగించాలని సూచిస్తూ వారి థంబ్‌ను తప్పని సరి చేసింది. వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్ భూ సేకరణ విభాగాల్లోని కంప్యూటర్లలో ఇప్పటికే ఇన్స్టాల్ చేశారు. థంబ్ నమోదు కోసం బయోమెట్రిక్ డివైస్ పంపిణీ చేశారు.
ప్రతీ సర్వే నెంబర్కు ‘ఓటీపీ’
ఆధార్, థంబ్ తప్పనిసరి చేయడంతో నిర్వాసితులందరూ భూసేకరణ కోసం ఏర్పాటు చేసిన ఆఫీసులకు తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో భూ సేకరణ బాధ్యులైన అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు కూడా తమ ఆఫీసుల్లోనే ఉండాల్సి వస్తోంది. ప్రాజెక్టులకు భూమి ఇస్తున్న రైతు, ఖాళీ స్థలం యజమాని తన బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ‘ప్రాజెక్ట్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్’లో అప్లోడ్ చేయడానికి థంబ్ నమోదు చేయాల్సి ఉంటుంది.
అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలు కూడా తమ థంబ్ నమోదు చేయాలి. ఆ తర్వాతే రైతులతోపాటు ఆఫీసర్లకు సంబంధించిన ఆధార్‌తో అనుసంధామైన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆయా ఓటీపీలను ఎంటర్ చేస్తేనే నిర్వాసితుడి అకౌంట్ ఓకే అవుతుంది. అయితే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో ఆఫీసర్లు గతంలోఉన్న పద్ధతిని అమలు చేయాలని కోరుతున్నారు. దీనికి ఎన్హెచ్ఏఐ ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది.
పెండింగ్‌లో రూ. 4.50 కోట్లు..
యాదాద్రి జిల్లా మీదుగా నిర్మాణమయ్యే ట్రిపుల్ ఆర్ కోసం తుర్కపల్లి, భువనగిరి, చౌటుప్పల్ ‘కాలా’ల పరిధిలో 1,795 ఎకరాలను సేకరిస్తున్నారు. భువనగిరి కాలా పరిధిలో ఇంకా సర్వే జరగలేదు. దీంతో సర్వే ముగిసిన తుర్కపల్లి, పురోగతిలో ఉన్న చౌటుప్పల్ పరిధిలో 1050 సర్వే నెంబర్లకు రూ. 147 కోట్లు పరిహారం అందింది. తాజాగా తుర్కపల్లి పరిధిలోని దాతరుపల్లి, వీరారెడ్డి పల్లి పరిధిలోని 90 సర్వే నెంబర్లకు సంబంధించిన లిస్ట్ ఎన్హెచ్ఐ వద్ద రెడీగా ఉంది.
ఆధార్, థంబ్ సేకరణ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయకపోవడంతో ఈ 90 సర్వే నెంబర్లకు సంబంధించి రూ. 4.50 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. తుర్కపల్లి, చౌటుప్పల్ కాలా పరిధిలో మరో 1600 సర్వే నెంబర్లకు సంబంధించి ఆధార్, థంబ్ నమోద్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే రూ. 280 కోట్లు నిర్వాసితులకు అందుతాయి.
