- ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ కొత్త రహదారులు
- రూ.19,300 కోట్లతో పనులు
- హ్యామ్ రోడ్లకు వర్క్ ఏజెన్సీలతో ముగిసిన ఒప్పందాలు
- జూన్ 28న సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 13,541 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. రెండేండ్ల తర్వాత ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ రోడ్ల పనులు మొదలవనున్నాయి. ఏకంగా రూ.19,300 కోట్లతో ఈ పనులు జరగనున్నాయి. హ్యామ్ స్కీమ్‌లో చేపట్టబోయే రోడ్లకు సంబంధించిన వర్క్ ఏజెన్సీలతో ఒప్పందాలు ముగిశాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నల్గొండ జిల్లాలో రోడ్ల పనులు ప్రారంభం కానున్నాయి. రాబోయే 30 నెలల లోపు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీలకు లక్ష్యం విధించారు. ఆ తర్వాత15 ఏండ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే కావడంతో వాహనదారులు, ప్రజలకు ఇక గతుకుల రోడ్ల తిప్పలు తప్పనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు..
రాష్ట్రంలోని ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్నేండ్లుగా రిపేర్లు లేకపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక రెండేండ్లుగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేకచోట్ల బీటీ రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
గతేడాది భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రోడ్లు ఎక్కువ డ్యామేజీ అయ్యాయి. ఆయాచోట్ల తాత్కాలిక రిపేర్లు చేపట్టినప్పటికీ నిధుల లేమితో శాశ్వత పునరుద్ధరణ పనులు చేయలేదు. ఇక పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది.
వర్షాలు పడితే చాలా గ్రామాలకు ఆటోలు, టూవీలర్స్ కూడా వెళ్లలేని పరిస్థితి. మారుమూల గ్రామాలకు కనీసం అంబులెన్స్‌లు కూడా వెళ్లలేకపోతున్నాయి. ఆయా రోడ్లపై ప్రజలు, వాహనదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్త రోడ్ల కోసం కూడా వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండేండ్ల తర్వాత రోడ్లకు మోక్షం కలుగబోతోంది.
హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో..
రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లలను దశలవారీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కింద నిర్ణయించింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) విధానంలో మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 96 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న13 వేల 541 కిలో మీటర్ల ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రోడ్లను డెవలప్ చేయాలనుకున్నది. నేషనల్ హైవే అథారిటీ, కర్నాటకలో సక్సెస్ అయిన ఈ ఫార్ములాను రాష్ట్రంలోనూ అనుసరించాలని భావించింది.
2025 జూన్ 20న జీవో జారీ చేసింది. సబ్ కమిటీ, రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత అదే ఏడాది అక్టోబర్ నెలలో టెండర్లు పిలిచారు. అయినా ముందకు సాగలేదు. లోకల్ కాంట్రాక్టర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆర్‌బీఐ బ్యాంక్ గ్యారంటీతో ప్యాకేజీలను మార్చుతూ ఈ ఏడాది రీటెండర్లు పిలిచారు. జాతీయ స్థాయిలో పేరుగల కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఈ సారి టెండర్లు వచ్చినా ఎక్సెస్ టెండర్ల విషయంలో విమర్శలు రావడంతో 5 శాతం
ఎక్సెస్ మించకుండా ప్రభుత్వం జీవో జారీ చేసి టెండర్లను ఫైనల్ చేసింది.
32 జిల్లాల్లో పనులు
రాష్ట్రంలో ఆర్ అండ్ బీ శాఖ తరపున 32 జిల్లాల పరిధిలో రూ.13,006 కోట్లతో 441 రోడ్లను బాగుచేయడానికి 34 ప్యాకేజీలుగా, పంచాయతీ రాజ్ శాఖ తరపున రూ.6294.81 కోట్లతో 7,449.50 కి.మీ మేర చేపట్టాల్సిన 2,162 రోడ్ల పనులను 17 ప్యాకేజీలుగా విభిజించి టెండర్లు ఫైనల్ చేశారు. మొత్తం రెండు శాఖల తరపున ఒకేసారి రూ.19,300 కోట్లతో పనులు చేపట్టడానికి సర్కారు అన్నీ ఏర్పాట్లు చేసింది. ఇందులో గ్రామీణ రోడ్లతో పాటు సింగిల్, డబుల్ లైన్ రోడ్లు, జిల్లా కేంద్రాలను కలిపే నాలుగు వరుసల రోడ్లు కూడా ఉన్నాయి.
అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద 10 శాతం నిధులు
హ్యామ్ విధానంలో ముందుగా కాంట్రాక్ట్ సంస్థలకు 10 శాతం నిధులు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద చెల్లించాలి. ఈ లెక్కన ఆర్ అండ్ బీ శాఖ రూ.1,300 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.630 కోట్లు ఏజేన్సీలకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసే బడ్జెట్ నిధుల నుంచి వీటిని చెల్లిస్తాం. అయితే హ్యామ్ విధానంలో వర్క్ అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్ట్ సంస్థలు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడానికి వీలుగా బ్యాంక్‌లోన్ తీసుకున్నాక తొలి విడుతలో 5 శాతం, పనులు మొదలు పెట్టాక మిగతా 5 శాతం నిధులు రిలీజ్ చేస్తాం.
- వెంకటేశ్వర్రావు, చీఫ్ ఇంజినీర్, హ్యామ్ రోడ్స్ విభాగం, ఆర్అండ్బీ శాఖ, హైదరాబాద్-
