- ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి తప్పిస్తారనే ప్రచారం
- పలువురు కీలక మంత్రుల శాఖల్లోనూ చేంజెస్
- మంత్రి వర్గంలోకి కొత్త ముఖాలు..
న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గంలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా, అనంతరం వరుసగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశాలు ఈ ఊహగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
ప్రధానంగా దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ ఉద్రిక్తలు, ఆయా మంత్రిత్వ శాఖల్లో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇతర అంశాలు మంత్రివర్గ ప్రక్షాళనకు అనివార్యంగా మారినట్టు తెలుస్తున్నది. కొత్త కేబినెట్‌లో జెన్-జీ ఆశయాలు, ఆలోచనలకు తగ్గట్టు.. యువ నేతలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తున్నది.
కీలక శాఖలకు సీనియర్లతోపాటు ఎంఓఎస్‌లుగా జూనియర్ల అవకాశం ఇచ్చే అంశంపై చర్చ జరుగుతున్నది. అయితే.. ఆయా శాఖల ప్రోగ్రెస్ కార్డు ఆధారంగా పలువురికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకనున్నట్టు సమాచారం. పలు శాఖల్లో వివాదాలు, కొన్ని శాఖల కుదింపు, పనితీరుపై అసంతృప్తి నేపథ్యంలో భారీగా శాఖల మార్పులు ఉండనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు ఆరుగురు సహాయ మంత్రులపై వేటు పడనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఈ దిశలో ఇప్పటికే మంత్రులకు ప్రధాని కార్యాలయం (పీఎంవో) నుంచి సిగ్నల్స్ అందినట్టు ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా మార్పులు జరిగే శాఖల్లో ఎలాంటి సమీక్షా సమావేశాలు, ముఖ్య కార్యక్రమాలు, కీలక నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.
విద్యాశాఖ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ఔట్?
దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రధాని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామ చేయాలని ప్రధాన డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) రెండు దఫాలుగా జంతర్ మంతర్‌లో ఆందోళన చేపట్టగా.. యువత, విద్యార్థులు తల్లిదండ్రులు, మేధావులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు.
ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేదంటే మరో శాఖకు బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఆయన్ను తప్పిస్తే.. విద్యాశాఖను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు అప్పగిస్తారని ప్రచారం. ఆమె స్థానంలో సీనియర్‌కు ఈ పగ్గాలు అప్పగించవచ్చని తెలుస్తున్నది.
అలాగే, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిపై కూడా వేటు పడనున్నట్టు సమాచారం. ఆయన స్థానంలో ఇటీవల బీజేపీలో చేరిన పంజాబ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేరు బలంగా వినిపిస్తున్నది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్‌కు ఈ మంత్రి వర్గ కూర్పులో భారీ శాఖలు దక్కే అవకాశం ఉంది. రవ్‌నీత్ సింగ్ బిట్టును బీజేపీ రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయకపోవడంతో, ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా కొనసాగే అవకాశం లేదని తెలుస్తున్నది. రవ్‌నీత్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్‌కు స్థానం కల్పించనున్నట్టు సమాచారం.
శక్తికాంత్ దాస్‌కు చోటు?
కొత్త మంత్రి వర్గంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేరు బలంగా వినిపిస్తున్నది. ఒకవేళ నిర్మలా సీతారామన్ శాఖను మార్చితే.. ఆ స్థానాన్ని శక్తికాంత్ దాస్‌తో భర్తీ చేసే చాన్స్ ఉన్నట్టు సమాచారం. ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కొత్త మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా బిహార్ మాజీ సీఎం నితిశ్ కుమార్‌కు కీలక మంత్రి పదవి దక్కనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
శివసేన (షిండే వర్గం) నుంచి ఎంపీ శ్రీకాంత్ షిండే, టీడీపీ, జనసేనల నుంచి ఒక్కొక్కరికి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నట్టు తెలుస్తున్నది. అలాగే, ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు మళ్లీ మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వీరితోపాటు కొత్తగా డా. లక్ష్మణ్, అరుణ్ గోవిల్, జనార్దన్ సింగ్, విష్ణుదత్ శర్మ, ఇతర నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది యూపీ, ఉత్తరాఖండ్‌లాంటి ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు నిశిత పర్యవేక్షణలో ఉన్నాయి.
ఏపీ నుంచి ఇప్పటికే ఒక కేబినేట్ మంత్రి, ఇద్దరు సహాయ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. అయితే తాజాగా లింగమనేని రమేశ్‌తో రాజ్య సభలో జనసేన ఎంపీల సంఖ్య3కు చేరింది. దీంతో కొత్తగా ఏపీ నుంచి జనసేన ఎంపీకి మంత్రివర్గ విస్తరణలో అవకాశం లంభించనుంది. అలాగే, టీడీపీ నుంచి కూడా మరొకరికి అవకాశం లభించనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి ఎంపీ ప్రసాదరావు, జనసేన నుంచి ఎంపీ బాలశౌరి రేసులో ఉన్నారు.
తెలంగాణ నుంచి మంత్రి మార్పు?
కాగా.. తెలంగాణ నుంచి మంత్రి మార్పు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి స్థానం పదిలంగా ఉన్నా.. ఇటీవల పరిణామాలతో బండి సంజయ్‌కి పదవీ గండం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే బీసీ వర్గానికి చెందిన డా. లక్ష్మణ్, అర్వింద్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే పార్టీ ఉపాధ్యక్షురాలిగా చేసిన ఎంపీ డీకే అరుణ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు రఘునందన్‌రావు, ఈటెల, ఎస్టీ కోటా ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేశ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
