11 మంది బంగ్లాదేశీ టెర్రరిస్టులపై చార్జిషీట్..ఈశాన్య రాష్ట్రాల్లో నెట్‌వర్క్ విస్తరణకు జేఎంబీ కుట్ర

11 మంది బంగ్లాదేశీ టెర్రరిస్టులపై చార్జిషీట్..ఈశాన్య రాష్ట్రాల్లో నెట్‌వర్క్ విస్తరణకు జేఎంబీ కుట్ర

న్యూఢిల్లీ: నిషేధిత జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) టెర్రరిస్టు సంస్థ శాఖ పన్నిన కుట్రకు సంబంధించి 11 మంది నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. గౌహతిలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జిషీట్‌లో, నిందితులపై బీఎన్​ఎస్​, 2023, యూఏ(పీ) చట్టం, 1967 కింద అభియోగాలు మోపారు. పశ్చిమ బెంగాల్, అస్సోం, త్రిపుర రాష్ట్రాల్లో టెర్రరిస్టు భావజాలాన్ని విస్తరించడానికి జేఎంబీ శాఖ అయిన 'ఇమామ్ మహమూదర్ కఫీలా' (ఐఎంకే) కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ  దర్యాప్తులో తేలింది.

ఈ కుట్రలో నిందితులు చురుకుగా పాల్గొన్నారు. టెర్రరిస్టు సంస్థ ఎజెండాను ప్రచారం చేయడం, బలహీనమైన యువతను బ్రెయిన్ వాష్ చేయడం, భారత్‌లో నెట్‌వర్క్‌ను విస్తరించడం వీరి ప్లాన్ అని అధికారులు గుర్తించారు. భారత గడ్డపై తమ ఎజెండాను ప్రచారం చేయడానికి ఏఎంబీ సీనియర్ సభ్యుడు ఇమామ్ మహమూద్ హబీబుల్లా ఈ ఐఎంకేను స్థాపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు రహస్య సమావేశాలు, అతివాద సాహిత్యం పంపిణీతో పాటు భారత్ వ్యతిరేక ప్రచారం కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకున్నారు.