- షిప్‌లో ఉన్న 21 మంది సిబ్బంది సురక్షితం
- ఇరాన్ డ్రోన్ దాడే కారణమని అమెరికా ఆరోపణ
సింగపూర్/వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న సింగపూర్ రిజిస్టర్డ్ కంటైనర్ నౌక ‘ఎవర్ లవ్లీ’పై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో నౌక పాక్షికంగా దెబ్బతిన్నట్లు సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సింగపూర్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ నౌక జలసంధి దాటుతుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని ‘బ్రిడ్జ్’(నియంత్రణ గది) ప్రాంతం దెబ్బతింది. షిప్‌లోని ఇంజన్, నావిగేషన్ పరికరాలు పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
నౌకలో ఉన్న 21 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని, వారిలో ఇండియన్లు, సింగపూర్ పౌరులెవరూ లేరని ఎంపీఏ స్పష్టం చేసింది. ఈ నౌక తైవాన్‌కు చెందిన ప్రముఖ షిప్పింగ్ సంస్థ ‘ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పొరేషన్’కు చెందినది. బ్రిటన్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సూచించిన సురక్షిత మార్గంలో ప్రయాణిస్తుండగానే, ఒమన్ తీరానికి సమీపంలో ఈ దాడి జరిగిందని సదరు ఆ సంస్థ తెలిపింది. ఈ నౌకపై జరిగిన దాడి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని ఎంపీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు, తాజా దాడి నేపథ్యంలో.. హార్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన షిప్‌లను, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి చేపట్టిన తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో) సెక్రటరీ జనరల్ ఆర్సేనియో డొమింగ్యూజ్ ప్రకటించారు.
