- విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనాలని పిలుపు
- ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 7వ రోజుకు చేరుకున్న నిరసన
న్యూఢిల్లీ: పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నీట్ పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది.కేంద్రమంత్రి రాజీనామా డిమాండుతో ఈ నెల 28(ఆదివారం)న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద "ప్రధాన్ గో బ్యాక్" పేరిట నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం ఢిల్లీలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మీడియాతో మాట్లాడారు.
జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రైతు సంఘాలు, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా నిరసనలో పాల్గొని, నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోనున్నట్లు దిప్కే వివరించారు.పేపర్ లీకేజీల వల్ల ఎంతోమంది విద్యార్థులు మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం బాధ్యత తీసుకోకపోవడం దురదృష్టకరమని దిప్కే ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన ప్రదర్శన వారం రోజులుగా కొనసాగుతున్నది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం అర్థరాత్రి నిరసనకారులు ఆయనకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. నిరసన స్థలంలో ఉన్నవారంతా ఒక్కసారిగా "హ్యాపీ బర్త్‌డే టు యూ, ధర్మేంద్ర జీ" అంటూ పాటలు పాడారు.
