చీర ఆరేస్తుండగా కరెంట్ షాక్.. నిర్మల్ జిల్లా బోరిగాంలో యువతి మృతి

చీర ఆరేస్తుండగా కరెంట్ షాక్.. నిర్మల్ జిల్లా బోరిగాంలో యువతి మృతి

సారంగాపూర్, వెలుగు: విద్యుత్ షాక్ తో ఓ యువతి చనిపోయింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని అప్పారావుపేట్ గ్రామానికి చెందిన బద్నపల్లి రేఖ (23)కు నాలుగు నెలల కిందే బోరిగాం గ్రామానికి చెందిన వినోద్ తో వివాహమైంది. రేఖ శుక్రవారం ఉదయం దుస్తులు ఆరేసేందుకు బిల్డింగ్ పైకి వెళ్లింది.

చీర ఆరేస్తుండగా.. ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ఎల్ టీ విద్యుత్ లైన్లపై పడడంతో షాక్ కు గురైన రేఖ అక్కడికక్కడే చనిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి రాజన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సమాచారం అందకున్న నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, విద్యుత్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.