అమ్మాయి విషయంలో మందలించాడన్న ..కోపంలో యువకుడి హత్య.. మంచిర్యాలలో ఘటన

అమ్మాయి విషయంలో  మందలించాడన్న ..కోపంలో యువకుడి హత్య.. మంచిర్యాలలో ఘటన
  •     మృతుడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
  •     రెండు నెలలుగా మంచిర్యాల మహిళతో సహజీవనం

మంచిర్యాల, వెలుగు : మందలించాడన్న కక్షతో ముగ్గురు యువకులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీ సమీపంలో గల జాలగుట్టపై బుధవారం రాత్రి జరిగింది. టౌన్ సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా వెంకటాపురం​గ్రామానికి చెందిన బానోత్​ చిన్నా అలియాస్​లక్​పతి (30) కూలీ పనులు చేసేవాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

చిన్నాకు కొంతకాలం కింద ఇన్ స్టాగ్రామ్ లో మంచిర్యాల పట్టణంలోని అండాలమ్మ కాలనీకి చెందిన పద్మతో పరిచయమైంది. పద్మ భర్త గతంలోనే చనిపోవడంతో.. చిన్నా రెండు నెలల కింద మంచిర్యాలకు వచ్చి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. అండాలమ్మ కాలనీకి చెందిన బన్నీ అనే యువకుడు పద్మ మనవరాలి వెంట పడుతుండడంతో ఆ యువకుడిని చిన్నా మందలించాడు. దీంతో కక్ష పెంచుకున్న బన్నీ అతడి సోదరులు వినోద్, నర్సింహ కలిసి చిన్నాను చంపాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా... బుధవారం రాత్రి చిన్నను జాలగుట్ట వద్దకు తీసుకెళ్లారు. 

అక్కడ మద్యం తాగిన తర్వాత రాళ్లతో కొట్టి, కత్తితో గొంతుకోసి చిన్నాను చంపేశారు. ఎంత సేపైనా చిన్నా ఇంటికి రాకపోవడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల ఎంక్వైరీలో హత్య విషయం వెలుగుచూసింది. గురువారం ఉదయం చిన్నా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి డెడ్ బాడీని మహబూబాబాద్ తరలించారు. ముగ్గురు నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

కుటుంబ గొడవలు.. భర్తను చంపిన భార్య

కందనూలు, వెలుగు : కుటుంబ గొడవలతో ఆగ్రహానికి గురైన మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఆవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య (57), అలివేలు భార్యాభర్తలు. అలివేలు తన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని యాదయ్య అనుమానించేవాడు. 

ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే యాదయ్య అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం చనిపోయాడంటూ అలివేలు స్థానికులకు, బంధువులకు సమాచారం ఇచ్చింది. బుధవారం అంత్యక్రియల సమయంలో డెడ్ బాడీకి స్నానం చేయించేందుకు బంధువులు సిద్ధం చేస్తుండగా, యాదయ్య ఒంటిపై గాయాలు కనిపించాయి.

 దీంతో అనుమానించిన బంధువులు అలివేలును గట్టిగా ప్రశ్నించడంతో... తరచూ గొడవ పడుతుండన్న కోపంలో తానే ప్రైవేట్ పార్ట్స్ పై దాడిచేసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. యాదయ్య కుమార్తె పద్మ, అల్లుడు అంజనేయులు సైతం మంగళవారం యాదయ్య ఇంటికి వచ్చి మధ్యాహ్నం తిరిగి వెళ్లడంతో వీరి పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. బంధువులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.