చినుకు పడలే.. మొలకలు రాలే.. ఆందోళనలో పత్తి రైతులు

చినుకు పడలే.. మొలకలు రాలే.. ఆందోళనలో పత్తి రైతులు
  • తొలుత కొద్దిపాటి వర్షాలు కురువడంతో పత్తి విత్తనాలు నాటిన రైతులు
  • జూలై మొదటి వారంలోగా పత్తి గింజలు నాటుకోవచ్చు

మహబూబాబాద్, వెలుగు: మృగశిర కార్తె ప్రారంభంలో అక్కడక్కడ కురిసిన కొద్దిపాటి వానలకు  జిల్లాలో పలువురు రైతులు పత్తి విత్తనాలు వేశారు. తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకలు వచ్చినా ఎండిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బోర్ల నీటితో తడులు కడుతున్నా నీరు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలవనరులు అందుబాటులో ఉన్న రైతులే ముందస్తుగా పత్తి సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

5.13 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఖరీఫ్‌‌ సీజన్‌‌లో 5,13,289 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా. మహబూబాబాద్ జిల్లాలో 84,854 ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 5,053 ఎకరాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడం, ఎదుగుదల సరిగా లేకపోవడంతో  రైతులు నష్టపోతున్నారు. కొందరు డ్రిప్‌‌, మరికొందరు బోర్ల నీటితో మొక్కలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.జూన్ ప్రారంభం నుంచి జూలై మొదటి వారం వరకు పత్తి విత్తనాలు విత్తేందుకు అనుకూల సమయమని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఆలస్యంగా విత్తితే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

లోటు వర్షపాతం
జూన్ చివరి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షం ఉండగా.. మహబూబాబాద్‌‌లో 52 మిమీ., హనుమకొండలో 77 మి.మీ, వరంగల్‌‌లో 62 మి.మీ., జయశంకర్ భూపాలపల్లిలో 7 మి.మీ., జనగామలో 46 మి.మీ. నమోదైంది. ములుగు జిల్లాలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.864 నుంచి రూ.950 వరకు ఉండగా, అంతర్‌‌పంటగా కంది, మినుములు వేయడం  లాభమని అధికారులు సూచిస్తున్నారు. 

నాలుగు ఎకరాల్లో పత్తి నాటాను
2ఎకరాల్లో పత్తి పంట సాగు కోసం పత్తి గింజలను నాటాను. పత్తి విత్తనాలు ఎకరానికి 3ప్యాకెట్ల  చొప్పు నాటాను. ఒక్కొ పత్తి విత్తన ప్యాకెట్​   రూ. 950 కు  కొనుగోలు చేశాను. రెండు వారాలుగా వర్షాల జాడ లేకపోవడంతో పత్తి గింజలు సరిగ్గా మొలకెత్తడం లేదు.   బోరు   వసతి ఉండటంతో రోజుకు కొంత మేరకు  తడుపుతున్నాను. వర్షం కురిస్తే తప్ప సమస్య  పూర్తిగా తీరేలా లేదు.

సాదు జగ్గయ్య, రైతు పార్వతమ్మగూడెం గ్రామం, నెల్లికుదరు మండలం

పత్తి  సాగులో రైతులు జాగ్రత్తలు పాటించాలి
జిల్లాలో పత్తి పంటను సాగు  చేసే  రైతులు  భూమి పూర్తిగా తడిసేలా వర్షం కురిసిన తరువాత, జూలై మొదటి వారంలోగా పత్తి గింజలను నాటుకోవచ్చు. తేమ సరిగ్గాలేకుంటే వేసిన గింజలు ఎండల దాటికి మొలకెత్తవు. రైతులు అగ్రికల్చర్​ ఆఫీసర్ల సలహలు సూచనలను పాటిస్తు నాణ్యమైన పత్తి విత్తనాలను ఎంపిక  చేసుకోవాలి.

విజయ చంద్ర, మహబూబాబాద్​ జిల్లా అగ్రికల్చర్ ​ఆఫీసర్