నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆదివారం పెద్ది విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చివేశారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని టౌన్ శివారులోని దండుగడ్డ ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఎదుట ఓ అసైన్డ్‌భూమిలో ఏర్పాటు చేసేందుకు బీఆర్‌ఎస్ నాయకులు సన్నాహాలు చేపట్టారు. ఇందుకోసం మూడు రోజుల కింద భూమిపూజ చేసి, రెండు రోజులుగా గద్దె నిర్మాణం చేపట్టారు.
అయితే విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుమతి లేదంటూ ఆదివారం రాత్రి మున్సిపల్ అధికారులు గద్దెను కూల్చివేశారు. దీనిపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గద్దెను కూల్చివేశారని ఆరోపించారు. వివరణ కోసం మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించగా స్పందించలేదు.
