Super Food: దొండకాయతో దోస్తి.. కొత్తిమీర..కరివేపాకుతో పచ్చడి..ఇలా తయారు చేయండి..లొట్టలేయాల్సిందే..

Super Food: దొండకాయతో దోస్తి.. కొత్తిమీర..కరివేపాకుతో పచ్చడి..ఇలా తయారు చేయండి..లొట్టలేయాల్సిందే..

కూరలు ఎన్ని ఉన్నా నూరిన పచ్చడి అన్నంలో కలుపుకుని తింటే ఆ టేస్టే వేరు. అంతేకాదు ఆ కూర నచ్చదు... ఈ కూర బాగుండదు అనేవాళ్లు కూడా.. వాళ్లకి నచ్చిన కూరగాయలతో పచ్చడి నూరి పెడితే లొట్టలేసుకుంటూ తింటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా  దొండకాయతో దోస్త్ కట్టి...మిక్సీలో వేసి నూరుకుని తింటే ఆహా ఏమి రుచిలే అంటూ లొట్టలేస్తూ లాగించేస్తారు.  మరి ఇప్పుడు టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయిలో తెలుసుకుందాం. .. 

దొండకాయ పచ్చడి తయారీకి కావలసినవి

 

  • దొండకాయలు - పావు కిలో
  • పచ్చిమిర్చి - 50 గ్రాములు
  •  చింతపండు - పది గ్రాములు 
  • జీలకర్ర, పచ్చి శెనగపప్పు, మినప్పప్పు - ఒక్కోటి ఒక్కో టీస్పూన్ చొప్పున 
  • వెల్లుల్లి రెబ్బలు - ఐదు 
  • పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు 
  • తెల్ల నువ్వులు - ఒక టీస్పూన్ 
  • ఉప్పు - తగినంత 
  • నూనె - ఐదు టీస్పూన్లు
  •  కొత్తిమీర తరుగు - కొంచెం

తాలింపు కోసం

  • నూనె -ఒక టీస్పూన్ ఆవాలు, 
  • జీలకర్ర, పచ్చి శెనగపప్పు -ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున 
  • ఎండు మిర్చి - ఒకటి 
  • కరివేపాకు - కొంచెం 
  • ఇంగువ - పావు టీస్పూన్

దొండకాయ పచ్చడి తయారీ విధానం

ముందుగా దొండకాయలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడగాలి. దొండకాయలను చక్రాల్లా, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.  కడాయిలో మూడు టీ స్పూన్ల నూనె వేడిచేయాలి. అందులో జీలకర్ర, పచ్చి శెనగపప్పు, మినపప్పు, పల్లీలు, నువ్వులు వేసి రెండు నిమిషాలు వేగించాలి. 

తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు కూడా వేసి మిర్చి రంగు మారే వరకు వేగించి ఒక ప్లేట్లో కి తీసి పక్కన పెట్టాలి.ఇప్పుడు  అదే కడాయిలో రెండు టీస్పూన్ నూనె వేసి,దొండకాయ ముక్కలు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు వేగించాలి.

మిక్సీజార్లో వెల్లుల్లి రెబ్బలు, వేగించిన పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి కచ్చపచ్చాగా గ్రైండ్ చేయాలి. అందులోనే వేగించిన దొండకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పచ్చడిని గిన్నెలోకి తీసి కొత్తిమీర తరుగు కలపాలి. 

ఇప్పుడు మళ్లీ కడాయిలోని వేడి నూనెలో  కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి అవి చిటపటమంటున్నప్పుడు స్టవ్ ఆపేసి పచ్చడిలో తాలింపు వేసి కలపాలి. ఇలా తయారు చేసిన చట్నీని వేడి వేడి అన్నంలో కలుపుకొని ఒక స్పూన్​ నూనె వేసి కలుపుకొని తిన్నారంటే  లొట్టలేసుకుంటూ లాగిస్తారు.  మరి ఇంకెందుకు ఆలస్యం దొండకాయ చట్నీ తయారీకి రడీ అవుదామా మరి..!