42 ఏళ్లపాటు పోలీస్ శాఖకు సేవలందించిన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 18 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ఘనంగా వీడ్కోలు పలికారు. బంజారాహిల్స్‌లోని TGICC ఆడిటోరియంలో నిర్వహించిన రిటైర్మెంట్ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పాల్గొని పదవీ విరమణ చేసిన పోలీసులను సత్కరించారు.
రిటైర్ అయిన వారిలో ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు ఎస్సైలు, ఆరుగురు ఏఎస్సైలు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు అందించిన సేవలను సీపీ సజ్జనర్ అభినందించారు. అనంతరం వారికి జ్ఞాపికలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ రిటైర్డ్ పోలీసులకు పలు సూచనలు చేశారు. రిటైర్మెంట్ తర్వాత అందే డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక వడ్డీ ఇస్తామని చెప్పే మోసపూరిత సంస్థలను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టొద్దని హెచ్చరించారు. రిటైర్మెంట్ నిధులను వీలైనంత వరకు ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వసనీయ ఆర్థిక సంస్థల్లోనే భద్రపరచుకోవాలని సూచించారు.
పదవీ విరమణ తర్వాత ప్రారంభమయ్యే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ కోరారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రిటైర్డ్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పోలీస్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ పోలీసుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
