అంబర్‌పేట్, వెలుగు: రాష్ట్రంలోని మాలల హక్కుల సాధన కోసం ఈ నెల 28న మెదక్‌లో భారీ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తెలిపింది. మాలల హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద బొమ్మల మైసయ్య, ఆకుల పెంటయ్య నేతృత్వంలో మాలల హక్కుల సాధన సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్, విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాలల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలోని గ్రూప్3లో ఉన్న 26 మాల, మాల ఉప కులాలకు ఉద్యోగాలు రాకుండా, విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి వీల్లేకుండా, ప్రమోషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
ఈ అన్యాయంపై గత రెండేండ్లుగా సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులను, స్పీకర్‌ను, పార్లమెంట్ సభ్యులను, ఇతర పార్టీల అధ్యక్షులను కలిసి వివరించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మాల సమాజాన్ని రక్షించుకోవడానికి, మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మెదక్‌లో జరిగే మాలల హక్కుల సాధన సభలో కార్యాచరణ ప్రకటిస్తామని, అందుకు మాల విద్యార్థులు, ఉద్యోగులు సంఘాల నాయకులు, మాల ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేశ్, దిలీప్ పండుగ భాను, అనీష్ వర్మ, వేణు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
