వెనెజువెలాలో భూకంపం వచ్చి 24 గంటలు గడిచిపోయాయి. రాజధాని కరాకస్‌లో ఎటు చూసినా శిథిలాలే.. వేల సంఖ్యలో కూలిపోయిన భవనాల కింద జనం బతికి ఉన్నారా లేదా అనేది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అనుకున్న స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లు జరగటం లేదనే విమర్శలు వస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ 24 గంటలూ పని చేస్తున్నా.. శిథిలాల తొలగింపు పూర్తి కావటం లేదు. ఈ క్రమంలోనే భూకంపం వచ్చిన ఏరియాల్లో అదృశ్యం.. కనిపించటం లేదంటూ ప్రభుత్వానికి 39 వేల కంప్లయింట్స్ వచ్చాయి. ఈ 39 వేల మంది బతికి ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. భూకంపం వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిన 39 వేల మంది చనిపోయి ఉండొచ్చని.. శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని చెబుతున్నారు అధికారులు.
కుప్పకూలిన భవంతులు..
స్థానిక టీవీ చానెళ్లలో గురువారం ఉదయం ప్రసారమైన దృశ్యాలు అక్కడి భీభత్సాన్ని కళ్లకు కట్టాయి. ఒకప్పుడు గగనతలాన్ని తాకుతూ నిలిచిన బహుళ అంతస్తుల భవనాలు నేడు శిథిలాల దిబ్బల్లా మారాయి. సహాయక సిబ్బంది అత్యాధునిక యంత్రాలతో కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు. రాజధాని నగరంలో జనమంతా రోడ్లపైనే కాలం వెళ్లదీస్తున్నారు.
కూలిపోయిన ఇళ్లు, భవనాల శిథిలాల మధ్య తమ వారు ఎక్కడున్నారో తెలియక, రోదిస్తూ వెతుకులాడుతున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. అలాగే, ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్న వీడియోలలో.. ఆసుపత్రుల బయట, మైదానాల్లో వందలాది మంది బాధితులు భూమిపై, తాత్కాలిక బెడ్‌లపై చికిత్స పొందుతున్న దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, లా గ్వైరా రాష్ట్రంలో పూర్తిగా కూలిపోయిన ఒక భవనం శిథిలాల నుంచి ముగ్గురు పిల్లలను సహాయక సిబ్బంది ప్రాణాలతో బయటకు తీశారు.
కాగా, దేశంలోని పలు ప్రాంతాల్లో ఫోన్ నెట్‌వర్క్ లేకపోవడం వల్ల బాధితుల కుటుంబాల్లో ఆందోళన రెట్టింపయింది. ముఖ్యంగా వెనెజువెలాలో నెలకొన్న సుదీర్ఘ సంక్షోభం కారణంగా గతంలోనే దేశం విడిచి వెళ్లిన 77 లక్షల మందికి పైగా ప్రవాసులు.. స్వదేశంలో ఉన్న తమ బంధువులను సంప్రదించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. గురువారం సోషల్ మీడియాలో వేలాది మంది తమ వారి ఫోటోలను పోస్ట్ చేస్తూ, ఆచూకీ కనిపెట్టాలంటూ అభ్యర్థిస్తున్నారు.
ఎయిర్‌పోర్టు రన్‌వే, భవనాలు ధ్వంసం
భూకంపాల వల్ల రాజధాని కరాకస్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి. దేశంలోనే అతిపెద్దదైన సైమన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే, భవనాలు దెబ్బతినడంతో విమాన సర్వీసులను రద్దు చేశారు. సబ్‌వే రైలు సేవలు నిలిపివేశారు. ప్రమాదాలు జరగకుండా ఇండ్లకు గ్యాస్ సరఫరాను ఆపేశారు.
డిజాస్టర్ జోన్‌గా లా గ్వైరా..
భూ విపత్తు నేపథ్యంలో వెనెజువెలా ప్రజలను ఉద్దేశించి తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగెజ్ బుధవారం అర్ధరాత్రి ప్రసంగిస్తూ.. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ) ప్రకటించారు. భూకంపం వల్ల దెబ్బతిన్న ఆసుపత్రులు, ఇళ్ల పునర్నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లతో అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నామని, దీనిని ఆర్థిక మంత్రి పర్యవేక్షిస్తారని ఆమె తెలిపారు.
ఈ భూకంపాలతో దేశంలోని అన్ని ప్రాంతాల కంటే లా గ్వైరానే అత్యధికంగా విధ్వంసానికి గురైందని వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని ‘డిజాస్టర్ జోన్’గా ప్రకటించారు. ఇక్కడ వందలాది భవనాలు కుప్పకూలిపోయాయని, దేశంలోనే అత్యధికంగా ప్రాణనష్టం ఇక్కడే సంభవించిందన్నారు. పగటి వెలుతురు ఉన్నప్పుడే శిథిలాల కింద చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడాలనే లక్ష్యంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రెస్క్యూ టీమ్‌లను లా గ్వైరాకు తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు.
