ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి.. తెల్లారే సరికి శవమయ్యాడు: లండన్‎లో కామారెడ్డి జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి

ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి.. తెల్లారే సరికి శవమయ్యాడు: లండన్‎లో కామారెడ్డి జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి

హైదరాబాద్: లండన్‎లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి.. తెల్లారే సరికి శవమయ్యాడు. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి, -మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్ రెడ్డి (25) ఎమ్మెస్ చదివేందుకు 14 నెలల క్రితం లండన్ వెళ్లాడు. 

లీసెస్టర్ నగరంలోని ఓ యూనివర్శిటీలో ప్రస్తుతం ఎమ్మెస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇదిలా ఉండగా.. గురువారం బర్త్ డే పార్టీ ఉండటంతో ఫ్రెండ్ రూమ్‎కు వెళ్లాడు శ్రీనాథ్ రెడ్డి. రాత్రి ఫ్రెండ్ రూములోనే పడుకున్నాడు. ఉదయం ఫ్రెండ్ వచ్చి చూసేసరికి శ్రీనాథ్ రెడ్డి మృతి చెంది ఉన్నాడు. తీవ్ర భయాందోళనకు గురైన శ్రీనాథ్ రెడ్డి స్నేహితులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

ఉన్నత చదువులు మంచి చదివి ఉద్యోగం సాధిస్తాడనుకున్న కొడుకు విగతజీవిగా మారడంతో శ్రీనాథ్ రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీనాథ్ రెడ్డి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు, ఈ మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, విదేశాంగ శాఖను కోరుతున్నారు.