హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీ, గచ్చిబౌలిని ఇప్పుడు ఐటీ హబ్ అంటున్నారు గానీ ఒకప్పుడు బేగంపేట్ ప్రాంతం ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. హైదరాబాద్ నగరంలో ఐటీ విప్లవానికి పునాది పడి.. తొలి ఐటీ టవర్ నిర్మాణం జరిగింది బేగం పేట్లోనే అని ఈతరానికి తెలియదు.
హైదరాబాద్ సిటీలో తొలి మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ అమెరికన్ ఇంటర్‌గ్రాఫ్ కన్సల్టింగ్ బేగంపేటలోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించి తమ కార్యకలాపాలు సాగించింది. అయితే.. ఈ ఇంటర్‌గ్రాఫ్ కన్సల్టింగ్ భవనం కాలగర్భంలో కలిసిపోనుంది. భూగర్భంలోని నీటి సంపు దెబ్బతినడంతో.. నీటి సరఫరా వ్యవస్థలో లోపం తలెత్తిన కారనంగా.. ఆ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Much before Hyderabad became the IT destination, there was Intergraph Consulting located on the Begumpet Road. Started towards end of 80s, this was a landmark building.
— Hi Secunderabad!! (@ApnaSecbad) June 17, 2026
After it was acquired by Swedish tech company Hexagon, they moved to Hitec City. pic.twitter.com/R9O0kr87Hs
ఇప్పటి తరానికి హైదరాబాద్ ఐటీ హబ్ అంటే మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రంగూడ ప్రాంతాలు. కానీ నగరంలోని తొలితరం ఐటీ ఉద్యోగుల జ్ఞాపకాలు బేగంపేట్‌తోనే ముడిపడి ఉంటాయనడంలో సందేహం లేదు. 1987లోనే ఇంటర్‌గ్రాఫ్ కన్సల్టింగ్ కంపెనీ బేగంపేటలో ఈ భవనం నిర్మించి కార్యకలాపాలను ప్రారంభించింది. వందల మంది ఐటీ ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేసేవారు. ఈ సంస్థతోనే హైదరాబాద్‌లో ఐటీ రంగం వృద్ధికి తొలి అడుగు పడింది. అలాంటి ఈ భవనం కూల్చేసి కొత్తగా వాణిజ్య సముదాయాన్ని నిర్మించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సైబర్ టవర్ల నిర్మాణం జరగడానికి విప్రో, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీలకు ప్రభుత్వ భూములు కేటాయించడానికి ముందు, బేగంపేట్, అమీర్‌పేట్ ఐటీ కంపెనీలకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. బ్రిగేడ్, టాటా సర్విసోల్, విప్రో ఎయిర్‌టెల్, ఇంటర్‌గ్రాఫ్ వంటి ప్రముఖ కంపెనీలు మొదట బేగంపేట్‌లోనే తమ కార్యకలాపాలు సాగించాయి. ఇవే కాకుండా.. సత్యం సంస్థ మేఫెయిర్, సిటీ సెంటర్ కాంప్లెక్స్‌లలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. OSI పంజాగుట్టలో, HSBC బంజారా హిల్స్‌లోని రోడ్ నెం. 10లో పనిచేసేవి.
తొలినాళ్లలో హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలను ఆకర్షించడంలో బేగంపేట్ విమానాశ్రయం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండటం ఐటీ కంపెనీలకు సానుకూల అంశంగా మారింది. విదేశీ ప్రతినిధులు, కంపెనీ అధిపతులు నగరానికి సులభంగా రాగలగడం బేగంపేట్, అమీర్‌పేట్‌ల అభివృద్ధికి ఊపునిచ్చింది.
ఇంటర్‌గ్రాఫ్ కన్సల్టింగ్ వంటి కంపెనీలలో ఉద్యోగం పొందడం ఆ రోజుల్లో గొప్ప గౌరవంగా భావించేవారు. అమెరికన్ కంపెనీ రాకతో, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కూడా పెను మార్పులు జరిగాయి. బేగంపేట్‌ను కేంద్రంగా చేసుకొని కొత్త రోడ్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి.
అయితే.. కాల క్రమేణా ఐటీ కంపెనీల సంఖ్య పెరగడంతో మరింత విశాలమైన స్థలాలు అవసరం కావడంతో ప్రభుత్వం చొరవ తీసుకుని అప్పటికి ఖాళీ స్థలాలుగా, కొండలు గుట్టలుగా ఉన్న హై-టెక్ సిటీలో ఐటీ కంపెనీలకు భూములను కేటాయించింది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్‌కు తరలిపోవడం, ఐటీ కారిడార్‌ను మాదాపూర్ వరకూ విస్తరించడంతో, బేగంపేట్‌లోని చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను కొత్త ఐటీ కారిడార్‌కు మార్చాయి.
