పారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గృహేతర ప్యాక్డ్ ఎల్‌పీజీ సరఫరాపై ఉన్న అన్ని రకాల రంగాలవారీ ఆంక్షలను గురువారం(జూన్ 25) ఎత్తివేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలోనే సరఫరాలను పునరుద్ధరించింది.మరోవైపు సంక్షోభం ప్రారంభంలో నిలిపివేసిన బల్క్ ఎల్‌పీజీ సరఫరాపై కూడా యాభై శాతం మేర సడలింపులు ఇచ్చింది. దీంతో వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది.
పశ్చిమ ఆసియా సంక్షోభ సమయంలో పెట్రోకెమికల్, ఇతర రంగాల నుంచి C3-C4 స్ట్రీమ్‌లను మళ్లించి, వాటిని కేవలం ఎల్‌పీజీ ఉత్పత్తికే ఉపయోగించేలా నిత్యావసర వస్తువుల చట్టం కింద ఉత్తర్వులు జారీ చేసినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రస్తుతం దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి మెరుగుపడటం, అలాగే దిగుమతి చేసుకునే ఎల్‌పీజీ కార్గోల లభ్యత పెరగడాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం... ఎల్‌పీజీ పూల్‌కు C3/C4 స్ట్రీమ్‌ల మళ్లింపును తగ్గించాలని నిర్ణయించింది. దేశీయ ఎల్‌పీజీ లభ్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా, రోజువారీ దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి కనీసం 40 టీఎంటీకి తగ్గకుండా చూస్తూ... నాన్-ఎల్‌పీజీ అవసరాల కోసం C3-C4 స్ట్రీమ్‌ల కేటాయింపులను పెంచనున్నారు.
