హైదరాబాద్: కొన్ని కొన్ని సంఘటనల్లో దొంగల తెలివి చూసి పోలీసులే షాక్ అవుతుంటారు. అసలు ఎలా వస్తాయి రా బాబు మీకు ఇలాంటి ఐడియాలు అనేలా ఉంటాయి దొంగల ప్లాన్స్. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కూడా ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్‌లలో దాచి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఎయిర్ పోర్టులో కథ అడ్డం తిరిగింది. నిందితుల కదలికలపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయడంతో అసలు విషయం బయట పడింది. ఈ హై ప్రొఫైల్ స్మగ్లింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు గురించి ఇలా ఉన్నాయి.
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల దగ్గరి నుంచి రూ.3.36 కోట్ల విలువైన 2.271 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రయాణికులు తమ ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్‌లలో బంగారాన్ని పేస్ట్ రూపంలో దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. జూన్ 24న నిర్వహించిన తనిఖీల్లో ఈ బంగారాన్ని సీజ్ చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
