ఒక్కరోజే 5 దేశాల్లో భూకంపాలు యాదృచ్ఛికమే.. ఒకదానికొకటి సంబంధం లేదు..!

ఒక్కరోజే 5 దేశాల్లో భూకంపాలు యాదృచ్ఛికమే.. ఒకదానికొకటి సంబంధం లేదు..!

జకార్తా: ప్రపంచవ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం మధ్య..  కేవలం12 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే మూడు వేర్వేరు ప్రాంతాలైన ఉత్తర కాలిఫోర్నియా, వెనెజువెలా, జపాన్‌‌‌‌‌‌‌‌లను వరుసగా భారీ భూకంపాలు వణికించాయి. ఇండియా, నేపాల్‌‌‌‌‌‌‌‌లోనూ స్వల్ప భూకంపాలు నమోదయ్యాయి.

ప్రపంచ భూగర్భ పలకల్లో ఈ హఠాత్ అలజడి చోటుచేసుకోవడం గమనార్హం. అయితే, ఈ భూకంపాల మూలాలు ఒకదానికొకటి సంబంధం లేనివని, భౌగోళికంగా దూరంగా ఉన్నాయని ఇండోనేసియా విపత్తు నిపుణుల సంఘం(ఐఏబీఐ) సభ్యుడు దార్యోనో స్పష్టం చేశారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవించే కేంద్రాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవి ఒకే సమయంలో లేదా కొద్దిపాటి వ్యవధిలో సంభవించినప్పుడు అది కాకతాళీయమే అవుతుంది. ఒక భూకంపం వల్ల మరో ప్రాంతంలో భూకంపం ప్రేరేపితం కావడం కానీ, ఒకదాని ప్రభావం ఇంకోదానికి వ్యాపించడం కానీ జరగదు” అని ఆయన చెప్పారు. 

ఉత్తర కాలిఫోర్నియా, వెనెజువెలాలో భూమికి తక్కువ లోతులో ఉన్న స్థానిక ఫాల్ట్ లైన్ల (పగుళ్లు) వల్ల ప్రకంపనలు రాగా.. జపాన్‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌డక్షన్ జోన్ (భూగర్భ పలకలు ఒకదాని కిందకు మరొకటి నెట్టబడే ప్రాంతం) కదలికల వల్ల భూకంపం వచ్చిందన్నారు. ఈ విధంగా భిన్నమైన భౌగోళిక కారణాల వల్లనే ఈ వరుస విపత్తులు సంభవించాయని ఆయన వివరించారు.