ఇండియా, ఐర్లాండ్ మధ్య రెండు మ్యాచుల టీ20 సిరీస్ శుక్రవారం (జూన్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు టీమిండియా సరికొత్తగా బరిలోకి దిగబోతోంది. నయా కెప్టెన్‌తో పాటు పలువురు యువ ఆటగాళ్లు జాతీయ జట్టు తరుఫున అరంగ్రేటానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా క్రికెట్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి కళ్లు ఉన్నాయి. కేవలం 15 ఏళ్లకే టీమిండియాకు ఎంపికైన ఈ బుడ్డోడి అరంగ్రేటంపై ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీపై అరంగ్రేటంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెల్‌ఫాస్ట్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ మ్యాచ్‌కు ముందు ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొటక్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ అతడికి జట్టులో చోటు కల్పించడం కోసం ఇప్పటికే అద్భుతంగా రాణిస్తోన్న సీనియర్లను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైభవ్ అరంగేట్రంపై ఉన్న అంచనాల కంటే జట్టు అవసరాల ఆధారంగానే ఎంపిక నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయం ప్రకారమే ప్లేయింగ్ లెవన్ ఉంటుందని పేర్కొన్నారు.
‘‘వైభవ్ చాలా ప్రతిభావంతుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్, ఇండియా ఏ తరుఫున అతను బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే అతనిలో సహజసిద్ధమైన సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్‌లో అతను జోఫ్రా ఆర్చర్‌తో పాటు ఎంతో మంది అనుభవజ్ఞులైన బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతను నిస్సందేహంగా ఒక అసాధారణ ప్రతిభావంతుడు’’ అని ప్రశంసించారు.
అరంగ్రేటం చేస్తే మంచిది.. చేయకపోయినా మంచిదే:
ఐర్లాండ్ సిరీస్‌తో వైభవ్ టీమిండియా అరంగ్రేటంపై సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘మ్యా్చ్కు ముందు కెప్టెన్, హెడ్ కోచ్ తుది జట్టు గురించి నిర్ణయం తీసుకుంటారు. వైభవ్ అరంగ్రేటం చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఆడకపోయినా మంచిదే. ఎందుకంటే అతను చిన్న వయసులోనే భారత జట్టులో భాగమైయ్యాడు. భవిష్యతల్ అతనికి దక్కాల్సిన అవకాశాలు, గుర్తింపు తప్పకుండా లభిస్తాయి.
కాబట్టి, కేవలం అతనికి ఒక అవకాశం ఇవ్వడం కోసం ఇప్పటికే పరుగులు సాధిస్తున్న సీనియర్ ప్లేయర్‌ను జట్టు నుండి తొలగించకూడదని నేను భావిస్తున్నాను’’ అని అన్నారు. కొటక్ వ్యాఖ్యలతో వైభవ్ అరంగ్రేటంపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుత జట్టులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్స్ కోటాలో రిజర్వ్డ్. ఇద్దరు మంచి ఫామ్‌లోనే ఉన్నారు. వీళ్లలో ఒకరిని తప్పించి వైభవ్ కు అవకాశం కల్పించడం దాదాపు కష్టమే.
