తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకం

తెలంగాణ కొత్త సీఎస్ గా  సంజయ్ జాజు  నియామకం

తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజు నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన సంజయ్ జాజు.. 2029 ఫిబ్రవరి వరకు సర్వీస్‌లో కొనసాగనున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు ఈ నెల 30తో పదవీ విరమణ చేయనుండటంతో.. ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను రాష్ట్రానికి పంపాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మూడు రోజుల క్రితమే ఆయన కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు.

ALSO READ : ఆపరేషన్ సింధూర్‏లో ఆరుగురు సైనికులు మృతి

 

సంజయ్ జాజు కేంద్ర ప్రభుత్వంలో సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (Information & Broadcasting Ministry) కార్యదర్శిగా పనిచేశారు.పరిపాలన, పట్టణాభివృద్ధి, సమాచార సాంకేతికత, ఈ-గవర్నెన్స్ వంటి రంగాల్లో విస్తృత అనుభవం కలిగి ఉన్నారు.రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ విధాన రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు.

సంజయ్ జాజుకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన విజయవాడ సబ్ కలెక్టర్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. అంతేకాదు.. హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2014 నుంచి కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న సంజయ్ జాజు.. ఇప్పుడు మళ్లీ స్వరాష్ట్రానికి తిరిగివచ్చి తెలంగాణ పగ్గాలు చేపట్టబోతున్నారు.