చిన్నారుల్లో సనాతన ధర్మ సంప్రదాయాలపై ఆసక్తి పెంపొందించేందుకు.. వారి విద్యా, జీవితారంభం దైవానుగ్రహంతో శుభప్రదంగా సాగాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో జూలై 3వ తేదీ నుండి నూతనంగా “అక్షర గోవిందం” అన్నప్రాశన కార్యక్రమాలను ప్రారంభించనుంది.
శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాత ఆశీస్సులతో జూలై 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. ఈ వేడుక అనంతరం చిన్నారులకు ఆశీర్వచనం, ప్రసాదంతో పాటు.. ప్రత్యేక “అక్షర గోవిందం కిట్”ను ఉచితంగా అందజేస్తారు. 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు ఈ అక్షరాభ్యాసంలో పాల్గొనవచ్చు.
ఈ అక్షర గోవిందం కిట్‌లో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణంతో పాటు.. స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, పెద్దబాలశిక్ష, సుప్రభాతం పుస్తకాలు వంటి విద్యా, పూజా సామగ్రి ఉంటాయి.
ఇక ఇదే వేదికపై ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వేదోక్తంగా, ఆగమోక్తంగా చిన్నారులకు తొలి అన్నప్రాశన సేవను కూడా నిర్వహించనున్నారు.
►ALSO READ | జ్యోతిష్యం: శక్తివంతమైన పౌర్ణమి..తిరోగమనంలో బుధుడు.. 4 రాశుల వారు పట్టింది బంగారం
భక్తులు గమనించాల్సిన ముఖ్య విషయమేమిటంటే.. జూలై 4 నుంచి మంగళవారం మినహా అన్ని రోజుల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజూ రెండు బ్యాచ్‌లలో.. బ్యాచ్‌కు 25 మంది చొప్పున మొత్తం 50 మంది చిన్నారులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి, పాల్గొనదలచిన వారు గంట ముందే ఆలయ ప్రాంగణంలో ముందస్తు నమోదు చేసుకోవాలి. అలాగే, చిన్నారులు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రధారణలోనే హాజరుకావాల్సి ఉంటుంది.
శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య అనుగ్రహంతో తమ పిల్లల విద్యాభ్యాసాన్ని, అన్నప్రాశనను పవిత్రంగా నిర్వహించుకునేందుకు భక్తులందరూ ఈ ప్రత్యేక సేవలను సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
